ప్లాన్‌ లేని సీప్లేన్‌ ! | - | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ లేని సీప్లేన్‌ !

Dec 2 2025 9:48 AM | Updated on Dec 2 2025 9:48 AM

ప్లాన్‌ లేని సీప్లేన్‌ !

ప్లాన్‌ లేని సీప్లేన్‌ !

భూముల అమ్మకాలు..

ప్రాజెక్టుకు అతీగతీ లేక.. చంద్రబాబు సర్కారు నవ్వులపాలు ఏడాది క్రితం అట్టహాసంగా ట్రయల్‌ రన్‌, డెమో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లిన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ఆపై ఒక్క అడుగు కూడా ముందుకు పడని వైనం జెట్టీల నిర్మాణం ఎప్పుడో?

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కృష్ణానది ఒడ్డున పర్యాటక రంగాన్ని పరుగులు పట్టిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రకటనలన్నీ నీటిమూటలేనని మరోసారి స్పష్టమైనట్లుగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న పున్నమీ ఘాట్‌ నుంచి సీప్లేన్‌ పేరుతో ఏడాది క్రితం తెగ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు కిమ్మనడం లేదు. సీప్లేన్‌తో ఆదాయాన్ని సృష్టించి ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతం చేస్తామంటూ సీప్లేన్‌ డెమో రోజున కూటమి నేతలు అనేక ప్రకటనలు చేసి ఊదరగొట్టారు. మరో వారం పది రోజుల్లో విజయవాడ నుంచి శ్రీశైలం, మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు సీప్లేన్‌లో తిరగొచ్చంటూ అప్పట్లో హడావుడి చేశారు. కానీ అవేమీ కార్యరూపం దాల్చకపోవటంతో జిల్లా ప్రజానీకం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతోంది.

నీటిపై ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చంటూ..

విజయవాడ నుంచి శ్రీశైలం సీ ప్లేన్‌లో వెళ్లడానికి కేవలం 20 నిమిషాలే పడుతుంది. అయితే టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయడానికి మాత్రం మరో 10 నిమిషాల సమయం తీసుకుంటారు. మొత్తంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం సుమారు 30 నిమిషాలు ఉంటుంది. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన సీప్లేన్‌ విజయవాడలోని పున్నమీఘాట్‌లోని జలాల్లో టేకాఫ్‌ అయి శ్రీశైలం జలాల్లో ల్యాండ్‌ అవుతుంది. నీటిపైన సుమారు 1500 అడుగుల్లో ఈ సీప్లేన్‌ ప్రయాణిస్తూ నీటి ప్రవాహాన్ని, ఇతర భూమిపైన ఉన్న సౌందర్యాన్ని తిలకిస్తూ వెళ్ల వచ్చంటూ పాలకులు ప్రకటించారు. ఈ ప్లేన్‌ ల్యాండింగ్‌, టేకాఫ్‌ కోసం రెండు ప్రాంతాల్లో నీటిపై ప్రత్యేకంగా జెట్టీలను సిద్ధం చేస్తామంటూ గత ఏడాది పర్యాటక శాఖ ప్రకటించింది.

ఏడాదైనా..

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చంద్రబాబు సీప్లేన్‌ను ప్రారంభించి ఈ నెలతో ఏడాది ముగిసింది. దీనిపై పర్యాటక శాఖలో ఎవరిని కదిలించినా ‘ఏమో సార్‌.. మాకు తెలియదు..!’ అంటూ సమాధానమివ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై పర్యాటక శాఖలో చెప్పేవారు సైతం కరువయ్యారు. హడావుడిగా ప్రజలను మభ్యపెట్టడానికి సీప్లేన్‌ను తీసుకొచ్చి షో చేసి మాయ చేశారంటూ విజయవాడ వాసులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే రీతిలో ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందంటూ వారు విమర్శిస్తున్నారు. ఏడాది క్రితం ప్రారంభించి త్వరలోనే చార్జీలను నిర్ణయించి సీప్లేన్‌ ప్రారంభిస్తామని చెప్పిన పాలకులు.. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ పర్యాటక శాఖ సిబ్బంది సైతం ప్రశ్నించటం గమనార్హం.

పర్యాటక రంగ అభివృద్ధి అంటే ఆ శాఖ పరిధిలోని భూములను అమ్మకాలు చేయటమా? అని పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న భవానీద్వీపంలోని స్థలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు 99 సంవత్సరాలు అప్పగించటంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పర్యాటకాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని సృష్టిస్తాం.. ఉపాధిని పెంచుతామంటూ పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. సంపద సృష్టించడమంటే చంద్రబాబు ప్రభుత్వం దృష్టిలో భూములు అమ్మకాలు చేయటం అని అర్థమవుతోందని పర్యాటక శాఖలో పని చేస్తున్న పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

ఏమో.. మాకేం తెలీదు.. అంటున్న టూరిజం అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement