డిప్రెషన్‌లో నవతరం
25 ఏళ్లలోపు వారిలోనూ మానసిక రుగ్మతలు ఒత్తిళ్లతో దురలవాట్లకు బానిసలవుతున్న వైనం ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్య నిపుణులు
కారణాలివే..
నాకంటే, పక్కవారికి ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను ఎందుకు సాధించలేక పోయాను అని మానసిక ఆందోళనకు గురవుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు.
తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి పిల్లలపై ప్రభావం చూపుతోంది. నా ఫ్రెండ్ మంచి బైక్, ఖరీదైన సెల్‌ఫోన్ వాడుతున్నాడు. నేను వాడలేక పోతున్నానే అని ఆందోళన చెందుతున్న వారు ఉన్నారు.
సోషల్ మీడియా యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేను పెట్టిన పోస్టింగ్‌కు ఎక్కువ లైక్స్, కామెంట్స్ రాలేదు. ఎవరూ షేర్ చేయలేదని డిప్రెషన్‌కు గురయ్యే వారు ఉన్నారు. తనతో యువతులు ఎవరూ చాటింగ్ చేయడం లేదు. నాలో ఎక్కడ లోపం ఉంది అని ఆలోచిస్తూ డిప్రెషన్‌కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
సెల్‌ఫోన్, ఇంటర్నెట్, వీడియోగేమ్స్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, బెట్టింగ్స్ వంటి వాటికి పిల్లలు విపరీతంగా బానిసలై చాలా దుర్భమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ వ్యసనాలను కూడా మానసిక రుగ్మతలుగా గుర్తించి సకాలంలో మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి.
సెల్ఫీ పోస్టు చేసిన తర్వాత అంచనాలకు తగ్గట్టు లైక్స్ రాలేదని తీవ్ర అసహనానికి గురయ్యే వారు ఉన్నారు.
చిన్న విషయానికే ఒత్తిడికి లోనవుతున్నారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశాభివృద్ధిలో భాగస్వాములైన నవతరం ప్రస్తుతం డిప్రెషన్‌తో సతమతమవుతోంది. అయితే దీనికి భయపడొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన ఆలోచనలు.. ఆచరణలు అన్నీ మెదడుపై ఆధారపడి ఉంటాయి. కర్తవ్యాలను నెరవేరుస్తూ లక్ష్యాలను చేరి ఆనందంగా ఉండటానికి, ఇతర అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండేలా చూడాలి. అయితే నేటి యువత డిప్రెషన్‌తో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇవే నిదర్శనం
● లబ్బీపేటకు చెందిన వెంకటేష్ (పేరు మార్చాం) ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థి. ఇటీవల తీవ్ర మానసిక ఒత్తిళ్ల కారణంగా మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతనికి కౌన్సి లింగ్ ఇవ్వగా, సోషల్ మీడియా ప్రభావంతో డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపారు.
● విద్యాధరపురానికి చెందిన నరేష్(పేరు మార్చాం) ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఇటీవల చదువుపై దృష్టి పెట్టకపోవడం, ఆహారం సరిగా తీసుకోక పోవడంతో మానసిక నిపుణులను ఆశ్రయించారు. అక్కడ కౌన్సిలింగ్ చేయగా, ‘ఎంత చదివినా మార్కులు రావడం లేదు. తనకంటే స్నేహితులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని’ డిప్రెషన్‌కు గురవుతున్నట్లు తెలిసింది.
ఇలా నేటి యువత అనేక కారణాలతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. నగరంలోని మానసిక నిపుణులను సంప్రదిస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. ఒక్కో మానసిక నిపుణుడి వద్దకు నెలకు 15 నుంచి 20 మంది వరకూ డిప్రెషన్‌కు గురవుతున్న వారు వస్తున్నట్లు చెబుతున్నారు.
యువతలో పెరుగుతున్న డిప్రెషన్
ప్రస్తుతం 14 నుంచి 25 ఏళ్ల మధ్య వారు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్‌కు లోనై ఆహారం సరిగా తీసుకోక పోవడం, దిగులుగా ఉండటం, చదువుపై దృష్టి పెట్టలేక పోతున్నట్లు చెబుతున్నారు. ఫిజికల్ ఎక్సర్‌సైజు లేక పోవడం యువతపై ప్రభావం చూపుతోందంటున్నారు. ప్రధానంగా పరీక్షల విషయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు వైద్య నిపుణులు అంటున్నారు.
నేటి యువత ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్‌కు గురవుతున్నారు. నిజంగా సీరియస్‌గా ఏమి తీసుకోవాలి, లైట్‌గా ఏమి తీసుకోవాలో తెలియడం లేదు. దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలో కూడా విచక్షణ ఉండటం లేదు. ఇంటర్మీడియెట్, పాఠశాల స్థాయిలో కేవలం సిలబస్ పూర్తి చేయడం, మార్కులు, ర్యాంకులు, బట్టీ చదువులపైనే దృష్టి పెడుతున్నారు. విలువలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడం ఎలా అనే అంశాలను తెలియచేయడం లేదు. డిప్రెషన్‌కు సోషల్ మీడియా కూడా కారణమే.
– డాక్టర్ యు.రాఘవరావు, మానసిక వైద్య విభాగాధిపతి, ప్రభుత్వాస్పత్రి
డిప్రెషన్‌లో నవతరం


