భజే భవాని
కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
ఆలయ ప్రాంగణంలో..
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పలు, భవానీలు, సాధారణ భక్తులు రావడంతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరగడంతో ఈఓ శీనా నాయక్ సిబ్బందికి సూచనలు చేశారు. ఘాట్ రోడ్డు ద్వారా ఇంద్రకీలాద్రిపైకి వచ్చే వాహనాలను ఓం మలుపు వద్ద క్రమబద్ధీకరించారు. ఘాట్ రోడ్డు వైపు ఇటు మహామండపం వైపు నుంచి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను బ్యాటరీ వాహనాల్లో తరలించే ఏర్పాటు చేశారు. రూ.500 దర్శనం క్యూతోపాటు అన్ని లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
లగేజీని క్లోక్ రూమ్‌లో పెట్టేలా చర్యలు
ఇంద్రకీలాద్రిపై భద్రతా చర్యల్లో భాగంగా కాలేజీ బ్యాగులు, లగేజీతో ఆలయ క్యూల్లో ప్రవేశించిన భక్తులను చూసిన ఈఓ శీనానాయక్ వారిని వెనక్కి పంపి లగేజీని క్లోక్ రూమ్‌లో పెట్టుకుని రావాలని ఆదేశించారు. ఆర్జిత సేవలైన సూర్యోపాసన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన తదితర సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు కుమ్మరిపాలెం సెంటర్ నుంచి టోల్‌గేట్ వరకు వాహనాలను రోడ్డు పక్కన పార్కింగ్ చేయించారు.
ఇంద్రకీలాద్రిపై క్యూలో భక్తజనం
భజే భవాని


