షరామామూళ్లే!
భారీగా పన్ను ఎగనామం..
పన్ను చెల్లింపులు..
● విజయవాడ కేంద్రంగా
రూ. కోట్ల హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం
● పన్నులు మాత్రం నామమాత్రమే
● రైల్వేస్టేషన్ నుంచి బిల్లులు
లేకుండా భారీగా సరుకు దిగుమతి
● చోద్యం చూస్తున్న వాణిజ్య
పన్నుల శాఖ అధికారులు
● గతంలో నిఘా పెట్టి మరీ
మామూళ్లు దండుకున్నట్లు ఆరోపణలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ కేంద్రంగా కోట్లాది రూపాయల హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం జరుగుతున్నా.. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు మాత్రం నామమాత్రంగానే ఉంటు న్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి పరిసర ప్రాంతాలకు నిత్యం వందల బేళ్లు రెడీమేడ్ దుస్తులు దిగుమతి అవుతుంటాయి. వాటికి ఎటువంటి బిల్లులు ఉండటం లేదు. అయినప్పటికీ పట్టించుకునే అధికారులు కరువయ్యారు. రైల్వేస్టేషన్ నుంచి వివిధ వాహనాల్లో యథేచ్ఛగా సరుకు బయటకు వచ్చి ఆయా దుకాణాలకు చేరుతున్నా.. అధికార యంత్రాంగానికి ఏమాత్రం తెలియకపోవటం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పలు మార్గాల్లో బయటకు..
విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సరుకు వివిధ మార్గాల్లో బయటకు వస్తోంది. సరుకు సాధారణంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న మార్గం ద్వారా బయటకు రావాల్సి ఉంది. కొంతమంది పాతబస్తీ తారాపేట వద్ద రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఉన్న మార్గం ద్వారా బయటకు సరుకును తీసుకెళ్తుంటారు. అయితే వీటి ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు నిఘా ఉంటుందనే ఆలోచనతో వ్యాపార వర్గాలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫారం మీదుగా డీఆర్‌ఎం ఆఫీస్ సమీపంలో బయటకు వచ్చే మార్గం ద్వారా బేళ్లను వ్యాపారులు తీసుకుళ్తుంటారు. ఈ మార్గం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సరుకు బయటకు తీసుకెళ్లి తమతమ దుకాణాలకు చేర్చుకుంటారు. ఎటువంటి బిల్లులు లేకుండా రాష్ట్రాలు దాటి సరుకు నగరానికి చేరుకోవటం చాలా సులువుగా జరిగిపోతుంది.
పండుగ సీజన్‌లో భారీగా..
సాధారణంగా పండుగల సమయంలో రెడీమేడ్ సరుకు భారీగా దిగుమతి అవుతుంది. అందులోనూ సంక్రాంతికి రెండు మాసాల ముందుగానే సరుకు హోల్‌సేల్లర్లు నగరానికి తెప్పించుకుంటారు. డిసెంబర్ క్రిస్మస్, కొత్త సంవత్సరాది, సంక్రాంతి పర్వదినం.. ఈ మూడు ముఖ్యమైన పండుగలకు భారీగా వస్త్ర వ్యాపారం జరుగుతుంది. వాటిని గమనంలో ఉంచుకొని ఈ రెండు మాసాలు వ్యాపార వర్గాలు తమ సరుకును భారీగా తీసుకొస్తారు. దానిని రైల్వే ద్వారా తెచ్చుకుంటున్నారు. వాటికి ఎటువంటి బిల్లులు లేకుండా నేరుగా నగరానికి తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్ నుంచి వారివారి దుకాణాలకు యథేచ్ఛగా చేర్చుకుంటారు.
రెండు మాసాలు నిఘా ఉంచినా..
రైల్వేస్టేషన్ నుంచి భారీగా సరుకు నగరానికి వస్తున్న విషయం తెలుసుకున్న వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గత ఏడాది ఇదే సీజన్‌లో దీనిపై నిఘా ఉంచారు. సుమారు రెండు మాసాలు పూర్తిగా తమ సిబ్బందికి ఈ రైల్వేస్టేషన్ వద్ద విధులు కేటాయించారు. రెండు మూడు షిఫ్టుల్లో సిబ్బంది రైల్వేస్టేషన్ వద్ద కాపలా కాశారు. విచిత్రమేమిటంటే అన్ని రోజులు విధులు నిర్వర్తించినా ఒక్కటంటే ఒక్క కేసూ నమోదు చేయలేదు. విధులు నిర్వర్తించిన సిబ్బందికి ఒక్క బేలు సైతం కనపడకపోవటం సర్వత్రా విస్మయానికి గురి చేసింది. దీనిపై చాలా ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి.
బిల్లులు లేకుండా అక్రమంగా వస్తున్న వస్త్ర సరుకు నిల్వల కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులను వ్యాపారులు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల పన్ను శాతం తగ్గినప్పటికీ బిల్లులు లేని సరుకు నిల్వలు విక్రయాల ద్వారా అసలు ప్రభుత్వానికి లెక్కలు తెలియకుండా పోతుంది. తద్వారా కేవలం వాణిజ్య పన్నుల శాఖ మాత్రమే కాకుండా మిగిలిన శాఖలకు సైతం రావాల్సిన పన్నులను ఎగొట్టడానికి ఆస్కారమేర్పడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వేస్టేషన్ ద్వారా వచ్చే సరుకుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా ఉంచటం ద్వారా ప్రభుత్వ శాఖలకు రావాల్సిన పన్నులు సక్రమంగా అందటానికి వీలుంటుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


