అన్నం పెట్టిన సంస్థకే కన్నం
ఇప్పటికే ఒకసారి ప్రయత్నం..
రూ. 87లక్షలు చోరీ 15 రోజుల్లోనే కేసును ఛేదించిన రైల్వే పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్లో ఓ ప్రయాణికుడు నిద్రిస్తుండగా రూ.87 లక్షల నగదు ఉన్న అతని బ్యాగును చోరీ చేసిన నిందితులను రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో జీఆర్‌పీ డీఎస్పీ రత్నరాజు ఈ కేసులో ఇద్దరు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గుంటూరులోని ఒక పౌల్ట్రీ ఫారంలో మేనేజర్‌గా పనిచేస్తున్న బెజవాడ నాగరాజు యజమానుల సూచనల మేరకు గత నెల 31న విజయనగరం, విశాఖపట్నంలోని తమ బ్రాంచ్ కార్యాలయాలకు వెళ్లి.. అక్కడ నుంచి రూ.87లక్షల నగదుతో గుంటూరుకు బయలుదేరారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రాయగడ ఎక్స్‌ప్రెస్ బీ1 కోచ్‌లో ఎక్కిన ఆయన తన బ్యాగును బెర్త్ కింద పెట్టి నిద్రపోయాడు. ఒకటో తేదీ తెల్లవారుజామున 3.10 గంటలకు రైలు విజయవాడ చేరుకున్న సమయంలో నాగరాజు తన బ్యాగును చూసుకుంటే కనిపించలేదు. రైలు అంతా వెతికినా ఉపయోగం లేకపోవడంతో అదే రోజు విజయవాడ జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురవడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యేక బృందాలుగా..
ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, సీఐబీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. అందుబాటులోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు ఒక బృందం విశాఖపట్నం వెళ్లి అక్కడ బాధితుడు రైలు ఎక్కే సమయం నుంచి అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో రైలు విజయవాడ స్టేషన్ చేరుకున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి తలకు టోపీ, ముఖానికి మాస్క్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి, సిమెంట్ కలర్ లగేజీ బ్యాగుతో వెళ్తుండటంతో గుర్తించి అతని కథలికలను తనిఖీ చేశారు. అతని చేతిలోని బ్యాగు.. చోరీకి గురైన బ్యాగుగా బాధితుడు గుర్తించడంతో పోలీసులు అతని కథలికలపై అన్ని ప్రాంతాలలో నిఘా పెట్టారు. అయితే అతను ఎక్కడా కూడా తన ముఖానికి మాస్క్, తలకు టోపీ తీయకపోవడంతో ఆనవాళ్లు గుర్తు పట్టడం పోలీసులకు కష్టంగా మారింది.
సాంకేతిక పరిజ్ఞానంతో..
స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అనుమానితుడిని ట్రేస్ చేయగా ఆటోలో వారధి జంక్షన్‌కు చేరుకుని అక్కడ నుంచి ఒక ప్రైవేటు వాహనంలో పొన్నూరు చేరుకుని, అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో ఒంగోలు వెళ్లి అక్కడ తన దుస్తులు మార్చి, బ్యాగులోని నగదును మరో బ్యాగులోకి మార్చుకుని పలు ప్రాంతాలకు తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు సీసీ టీవీలు, బస్సు డ్రైవర్లు, కండక్టర్‌లను విచారించి, సెల్‌ఫోన్ టవర్‌ల ఐడీలను ఉపయోగించి సాంకేతిక సమాచారం ధ్రువీకరణ చేపట్టారు. బాధితుడికి దగ్గర లొకేషన్‌లోని సెల్ నంబర్‌లను సేకరించడం ద్వారా నిందితుడిని గుర్తించారు. బాధితుడు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కినప్పటి నుంచి నిందితుడు కూడా అదే రైలు ఎక్కినట్టు గుర్తించారు.
అన్నదమ్ముల పనే..
అదే విధంగా ఆ మేనేజర్ పనిచేసే పౌల్ట్రీలో ఇతర సిబ్బంది సెల్ ఫోన్ నంబర్‌లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయగా అనుమానితుడి నంబర్‌కు పౌల్ట్రీఫారంలో పనిచేసే బూదాల లలిత్‌కుమార్ నుంచి ఫోన్‌లు వెళ్లినట్టుగా గుర్తించారు. ఆ ఫోన్‌లు అతని తమ్ముడు బూదాల అశోక్ కుమార్ పేరుతో ఉండటంతో ఇద్దరు కలసి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీ జరిగినప్పటి నుంచి లలిత్‌కుమార్ కూడా కనిపించకపోవడంతో పోలీసులు వేగంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరు సోమవారం చైన్నె వెళ్లేందుకు విజయవాడ రైల్వేస్టేషన్‌కు వస్తున్న తరుణంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పార్శిల్ కార్యాలయం వద్ద దాడి చేసి అరెస్టు చేశారు.
బూదాల లలిత్‌కుమార్ తాను పనిచేసే సంస్థలో ఇతర బ్రాంచ్‌ల నుంచి తరచూ పెద్ద మొత్తంలో నగదు తీసుకువస్తుంటారని గమనించాడు. ఎలాగైనా నగదును చోరీ చేయాలని తన తమ్ముడు బూదాల అశోక్‌కుమార్‌తో కలసి పథకం వేశాడు. అందులో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీన సిబ్బంది రైలులో నగదుతో వస్తారని గమనించి చోరీకి యత్నించారు. అది కుదరకపోవడంతో అదే నెల 31న తన సోదరుడు చేత చోరీ చేయించాడు. ఆ నగదులో వారు అనేక ప్రాంతాలలో తిరుగుతూ చివరికి చైన్నె వెళ్లిపోయే క్రమంలో పోలీసులకు పట్టుపడ్డారు. చోరీ సొమ్ములో రూ.2.5లక్షలు జల్సాలకు వాడుకోగా, మిగి లిన రూ.84.5లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. పదిహేను రోజుల్లోనే కేసును ఛేదించిన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌లు జె.వి రమణ, ఫతే ఆలీబేగ్ తదితరులను రైల్వే డీఎస్‌పీ రత్నరాజు ప్రత్యేకంగా అభినందించారు.


