ఆహార భద్రత చట్టం అమలుపై నిరంతర పర్యవేక్షణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఆహార భద్రత చట్టం–2013 అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటోందని.. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్‌రెడ్డి జిల్లాలో విస్త్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరుతెన్నులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చట్టం స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది అడుగులు వేసేలా మార్గనిర్దేశం చేశారు.
పర్యటన ఇలా..
విజయవాడ అర్బన్ పరిధిలోని పటమటలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు అందుతున్న పోషకాహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూల్‌ను సందర్శించి.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చిన్నారులకు అందించేందుకు ఆహారాన్ని సిద్ధం చేస్తుండగా.. కమిషన్ చైర్మన్ సరుకుల నాణ్యత, మెనూ అమలును పరిశీలించారు. అజిత్‌సింగ్ నగర్‌లోని ఎంకే బేగ్ పాఠశాలను కూడా తనిఖీ చేశారు. తిరువూరులోని బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ఎస్‌సీ, బీసీ హాస్టళ్లను కూడా తనిఖీ చేశారు. మైలవరం నియోజకవర్గంలోని కుంటముక్కల గురుకుల పాఠశాల, వెలగలేరు హైస్కూల్‌ను సందర్శించి.. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ తదితరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా పౌర సరఫరాలు, ఐసీడీఎస్, విద్యాశాఖ, ఆహార భద్రత, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల అధికారులతో ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్‌వో ఎ. పాపారావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి.సతీష్ కుమార్, డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్
విజయ ప్రతాప్‌రెడ్డి


