జైల్లో స్నేహం.. బంగారమే లక్ష్యం
పోలీసులకు చిక్కిన అంతర జిల్లా దొంగల ముఠా 384 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజా
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను మచిలీపట్నం పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఖరీదు చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బందరు డీఎస్పీ చప్పిడి రాజా చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం..
జైలులోనే స్కెచ్..
బాపట్ల జిల్లా మార్టూరు మండలానికి చెందిన కారంపూడి విక్రంకుమార్ అలి యాస్ బాలబోయిన రమేష్ చిన్న తనం నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అనేకమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న క్రమంలో కొంతకాలం క్రితం ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన కొత్త రఘునాథ్, షేక్‌అమతుల్లాదిరి, రావులపాటి అయ్యప్ప, అందుగుల ఉదయ్‌కిరణ్‌లతో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి ఎలాగైనా దొంగతనా లు చేసి డబ్బును సంపాదించాలని అనుకున్నారు. అందుకు రమేష్ చోరీలు చేయగా దొంగిలించిన బంగారాన్ని పై నలుగురు కలిసి అమ్మి సొమ్ము చేసుకుని పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందం ప్రకారం..
జైలు నుంచి బయటికి వచ్చిన ఐదుగురు చేసుకున్న ఒప్పందం ప్రకారం రమేష్ చోరీలకు పాల్పడుతుండగా మిగిలిన నలుగురు నగలను అమ్మి సొమ్ము చేసుకుని వాటాలు వేసుకుని పంచుకోవటం మొదలుపెట్టారు. గత నెల 9వ తేదీన బాలబోయిన రమేష్ మచిలీపట్నంలోని నరసింహనగర్‌కు చెందిన కృష్ణా కో–ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగి ఐ. విష్ణు ఇంట్లోకి చొర బడి బీరువాలోని సుమారు 220 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు. అలాగే కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న మరో ఇంట్లోకి చొరబడి మరో ఏడు గ్రాముల బంగారాన్ని దొంగి లించాడు. జరిగిన చోరీలపై బాధితులు ఇరువురు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నందిగామలో దొరికారు..
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా రమేష్‌తో పాటుపై నలుగురు నందిగామ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిలకలపూడి పోలీసులు అక్కడికి చేరుకొని చాకచక్యంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని, విచా రణ చేపట్టారు. దీంతో రమేష్ మచిలీపట్నంతో పాటు పెనమలూరు, నెల్లూరు జిల్లాలోని వేదయపాలెం, గుంటూరు జిల్లాలోని నగరంపాలెం, పట్టాభిపురం ప్రాంతాల్లో కూడా అనేక చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు దొంగల ముఠా ఇచ్చిన సమాచారం మేరకు వారి నుంచి 384.9 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజా తెలిపారు. నిందితులను పట్టుకోవటంలో ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఆయ న అభినందించారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. చిలకలపూడి సీఐ ఎస్‌కే నభీ పాల్గొన్నారు.


