అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ
ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖరబాబు ‘సైబర్ సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం
పటమట(విజయవాడతూర్పు): సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మరో ముందడుగు వేస్తూ ‘సైబర్ సురక్ష’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. దీనిలో భాగంగా నెలరోజుల పాటు ప్రజల్లో అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారులకు, సైబర్ చట్టాలపై తర్ఫీదు పొందిన సిబ్బందికి సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ఏవిధంగా అవగాహన కల్పించాలి అనే విషయం గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో సైబర్ చట్టాలపై తర్ఫీదు పొందిన 227 మంది సిబ్బంది నగరంలో ఉన్న 227 బ్యాంకులకు వెళ్లి ఆ బ్యాంకులోని అధికారులతో కలిసి బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
సీసీ కెమెరాలతో రక్ష..
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో వివిధ కమ్యూనిటీల సహాయ సహకారాలతో దాదాపు 10 వేల కెమేరాలను ఏర్పాటు చేశామని, సురక్ష డివైజ్‌తో ప్రతి దేవాలయం, ప్రతి చర్చ్, ప్రతి మసీదులో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా 30 నుంచి 40 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని, ఎన్నడూ లేని విధంగా 80 శాతం రికవరీ ముందు ఉన్నామన్నారు. ప్రమాదవశాత్తూ మరణాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజుకు 92 మరణాలను తగ్గించగలిగామని పేర్కొన్నారు. పది వేల సీసీ కెమెరాలు డాష్ బోర్టులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బ్యాంకర్లకు అవగాహన..
బ్యాంకర్లతో అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేశామని, సైబర్ నేరగాళ్లు కరెంటు అకౌంట్లు ఏర్పాటు చేసి మోసాలకు ఏవిధంగా పాల్పడుతున్నారో వివరించామని సీపీ చెప్పారు. సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంటు అకౌంట్‌గా మార్చే ప్రతి ఖాతాను తప్పకుండా పరిశీలించాలని సూచించామన్నారు. 227 బ్యాంకులలో అవగాహన తీసుకువచ్చేందుకు 227 టీంలు మంగళవారం నుంచి పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, సైబర్ క్రైం డీసీపీ కృష్ణ ప్రసన్న, రూరల్ డీసీపీ బి.లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


