బోసిపోయిన బెజవాడ మార్కెట్లు
తుఫాన్ నేపథ్యంలో నిలిచిపోయిన వ్యాపారాలు ప్రభుత్వ హెచ్చరికలతో బయటకు రాని ప్రజానీకం దాదాపుగా స్తంభించిన రవాణా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మోంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం నగరంలోని మార్కెట్లు బోసిపోయాయి. తుఫాన్ హెచ్చరికలతో జిల్లాలో ప్రజల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా దర్శనమిచ్చే నగరంలోని ప్రధాన వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య ప్రాంగణాలన్నీ బోసిపోయి కనిపించాయి. నగరంలోని వివిధ మార్కెట్లకు నిత్యం లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. వారి రాకపోకలతో దుకాణాలన్నీ నిత్యం కళకళలాడుతూ దర్శనమిస్తుంటాయి. అయితే తుఫాన్ హెచ్చరికలతో నగరానికి వచ్చే రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో దుకాణాలు తెరిచి ఉన్నప్పటికీ ఏమాత్రం వ్యాపారాలు జరగలేదంటూ యజమానులు వాపోయారు. బీసెంట్‌రోడ్డు, బందరురోడ్డులోని ప్రధాన వ్యాపార కూడళ్లన్నీ బోసిపోయి దర్శనమిచ్చాయి.
ఖాళీగా దర్శనమిచ్చిన పాతబస్తీ మార్కెట్లు
తుఫాన్ నేపథ్యంలో పాతబస్తీలో వందలాది దుకాణాలు ఉన్న వివిధ ప్రధాన మార్కెట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా దాని పరిసర ప్రాంతాల్లో సుమారు వందకు పైగా హోల్‌సేల్ వ్యాపార సంఘాలు కొనసాగుతుంటాయి. వాటి పరిధుల్లో వేలాది దుకాణాలు పని చేస్తుంటాయి. తుఫాన్ హెచ్చరికలతో పాటుగా అధికారులు ప్రకటనలతో ప్రజానీకం ఎవరూ బయటకు రాకపోవటంతో ఆయా వ్యాపార కూడళ్లు అన్నీ బోసిపోయాయి. ముఖ్యంగా శ్రీ లాల్‌బహుదూర్ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ (వస్త్రలత), కృష్ణవేణి హోల్‌సేల్ మార్కెట్, మెయిన్‌బజార్, శివాలయంవీధి, పులిపాటి వారి వీధి తదితర ప్రాంతాల్లోని దుకాణాలన్నీ ఖాళీగా కనిపించాయి.
రైళ్లు, బస్సుల రద్దుతో...
తుఫాన్ కారణంగా నగరానికి వచ్చే రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. విజయవాడతో పాటుగా విశాఖపట్నం నుంచి బయలుదేరే పలు రైలు సర్వీసులను రైల్వేశాఖ ముందస్తు జాగ్రత్తగా రద్దు చేసింది. నిత్యం లక్షలాదిగా ప్రయాణికులతో దర్శనమిచ్చే రైల్వేస్టేషన్ సైతం బోసిపోయింది. దాంతో నగరానికి వచ్చే ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో పాటుగా నగరానికి వచ్చే బస్సు సర్వీసులను సైతం ఆర్టీసీ కుదించింది. కొన్ని రూట్లలో అనధికారికంగా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
అంతంతమాత్రంగానే బ్యాంకింగ్ లావాదేవీలు
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లోనూ అంతంత మాత్రంగానే సేవలు కొనసాగాయి. ప్రధానంగా నగరంలోని వందలాది బ్యాంకుల్లో లావాదేవీలు నామమాత్రంగానే కొనసాగినట్లు ఆయా బ్యాంకు ఉద్యోగులు వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా నగరంలోని వన్‌టౌన్‌లో ఉన్న ప్రధాన పోస్టాఫీస్ సైతం వినియోగదారులు లేక ఖాళీగా దర్శనమిచ్చింది.


