నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలు మినహా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ ఇంజినీర్లతో పాఠశాలల ఫిట్‌నెస్ ధ్రువీకరణ జరిగేలా ఎంఈవోలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరగతి గదులు, పైకప్పులు, ప్రహరీలు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు అన్నీ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను పాఠశాల భవనాల్లోకి అనుమతించాలన్నారు. పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం అధికారుల ఆదేశాల మేరకు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు సెలవులు కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.
జాతీయ బధిరుల క్రికెట్‌కు ఎంపికై న నాగూర్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న తొమ్మిదో ఇండియన్ జాతీయ బధిరుల చాంపియన్ షిప్ టీ20 క్రికెట్ పోటీలకు కొండపల్లికి చెందిన ఎండీ నాగూర్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బధిరుల క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘు బుధవారం నాగూర్‌కు సందేశం పంపారు. ఆల్‌రౌండర్ అయిన ఎండీ నాగూర్ నవంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఈ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బధిర క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు నాగూర్‌ను అభినందించారు.
తుపాను పునరావాస కేంద్రాల మూసివేత
పెనమలూరు: మోంథా తుపాను నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను అధికారులు మూసివేశారు. పెనమలూరు, పోరంకి, యనమలకుదురు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో సుమారు 500 మంది పేదలు తలదాచుకున్నారు. వారికి రోజున్నర పాటు అధికారులు ఆహారం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించిన ప్రభుత్వ సిబ్బంది బుధవారం ఉదయం పేదలకు అల్పాహారం అందించి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. రెండు రోజులుగా పనులు లేవని, ఇప్పుడు ఇళ్లకు వెళ్లి ఏమిచేయాలని పేదలు వాపోయారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవటంతో ఇళ్లకు వెళ్లిపోయారు. తుపాను ముందు హడావుడి చేసిన అధికారులు, నేతలు పత్తాలేకుండా పోయారని బాధితులు ఆరోపించారు.
పునరావాస కేంద్రంలో మహిళకు పాము కాటు
చల్లపల్లి: తుపాను పునరావాస కేంద్రాల్లో బాధితులకు రక్షణ కరువైంది. ఇద్దరు పిల్లలతో కేంద్రానికి వెళ్లిన తల్లి పాముకాటు బారినపడి ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రంలో జరిగింది. తుపాను నేపథ్యంలో మంగళవారం రాత్రి వక్కలగడ్డ గ్రామానికి చెందిన కట్టా లక్ష్మీతిరుపతమ్మ తన భర్త నాగరాజు, కుమార్తె సత్యఅక్షర, కుమారుడు జోఅఖిలానంద్‌తో కలిసి పునరావాస కేంద్రానికి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కుమార్తె సత్యఅక్షరను మరుగుదొడ్డికి తీసుకెళ్తున్న క్రమంతో లక్ష్మీతిరుపతమ్మ కాలిపై కట్లపాము కాటువేసింది. అనంతరం దానిని పునరావాస కేంద్రంలో ఉన్నవారు చంపేశారు. పునరావాస కేంద్రంలోని సచివాలయ సిబ్బంది 108కు కాల్‌చేసి బాధితురాలిని చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుపతమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అదే పునరావాస కేంద్రంలోని వంట గదిలో బుధవారం ఉదయం మరో కట్లపాము కంటపడటంతో అక్కడ ఆశ్రయం పొందిన వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు


