స్తంభించిన విజయవాడ..
విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా భవానీపురం, ఊర్మిళా నగర్, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, జమ్మీ చెట్టు సెంటర్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ రోడ్, ఎయిర్‌పోర్ట్ కారిడార్, ప్రసాదంపాడు ప్రాంతాల్లో రోడ్లపైన భారీగా నీరు నిలిచింది. ఈదురు గాలుల వల్ల రోడ్డు మీద పడిపోయిన కొమ్మలు, 93 వృక్షాలను తొలగించారు. నగరంలో దాదాపు 500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదకరమైన 60 హోర్డింగ్‌లను తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, తుపాను నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రైజరుపేటలో ఒకచెట్టు, ఒక విద్యుత్ స్తంభం కూలిపోయాయి. 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతంలో ఒక ఇల్లు కూలింది. ఇంట్లో సామగ్రి ధ్వంసమైంది. వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పర్యటించారు.


