పంట కన్నీరు!
భారీ
వర్షాలు
తుపాను ధాటికి జిల్లాలో 42,493 ఎకరాల్లో పంటలకు నష్టం ఉద్యాన పంటలకు సంబంధించి రూ. 5.5 కోట్ల నష్టం పలు నియోజకవర్గాల్లో పొంగిన వాగులు గ్రామాలకు నిలిచిన రాకపోకలు విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం విద్యుత్తు శాఖకు రూ.1.60కోట్ల నష్టం
ఎన్టీఆర్ జిల్లాలోని 17 మండలాల్లో 235 గ్రామాల్లో 16,876 మంది రైతులకు సంబంధించి 42,483 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో ప్రధానంగా పత్తి పంటకు సంబంధించి 25,170.05 ఎకరాలు, వరి 14,055 ఎకరాలు, మొక్కజొన్న 1747.5ఎకరాలు, ఇతర పంటలు 1,520 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.
ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి, కూరగాయలకు సంబంధించి 586.5 ఎకరాల్లో దెబ్బతిన్నా యి. 399 మంది రైతులకు సంబంధించి రూ.5.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా.
విద్యుత్తుకు సంబంధించి 11కేవీ పోల్స్ 128 విరగడం, వంగడం జరిగింది. ఎల్టీ పోల్స్ 146, ట్రాన్స్‌ఫార్మర్లు 94, మొత్తంగా రూ.1.60కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.
మైలవరం నియోజకవర్గంలోని కొండవాగు, కోతులవాగు, కళింగవాగు, కోవ వాగు, పులివాగు, దొర్లింతాల వాగు, కప్పలవాగు, తొమ్మండ్రం వాగులకు స్వల్ప వరద ప్రవాహం రావడంతో బుడమేరు వాగుకు వరద ప్రవాహం పెరిగింది. మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో పత్తి పంట స్వల్పంగా దెబ్బతింది. జి.కొండూరు మండల పరిధి గడ్డమణుగు, జి.కొండూరు, గంగినేని గ్రామాలలో 16 ఎకరాలలో బొప్పాయి పంట నేలవాలింది. కవులూరు గ్రామంలో 150 ఏళ్ల వయస్సు ఉన్న రావిచెట్టు నేల కొరిగింది. పలు చోట్ల కోతకు వచ్చిన వరిపైరు నేలవాలింది. వెంకటాపురం గ్రామంలోని ఎర్రచెరువు కళింగ వద్ద కట్ట కోతకు గురికావడంతో చెరువులో నీరు దిగువకు వెళ్లింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వృక్షాలు నేలకొరిగాయి. కొండపల్లిలో మటన్‌మార్కెట్ సెంటర్, సినిమా థియేటర్ సెంటర్లో ఇళ్లు నీట మునిగాయి. మండల పరిధిలో పత్తి, వరి, మినుము పంటలు నీటి ముంపునకు గురికాగా 50ఎకరాలలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి.
తిరువూరు నియోజకవర్గంలో కట్టెలేరు, పడమటి వాగు, వెదుళ్లవాగు, గుర్రపువాగు, తిప్పలవాగు, అనురాధవాగులకు వరద నీరు చేరింది. తిరువూరు–గంగపలగూడెం, తిరువూరు–మల్లేల, అక్కపాలెం–తిరువూరు, చౌటపల్లి–జి.కొత్తూరుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు, కోకిలంపాడు, ఆంజనేయపురం గ్రామాలలో వరిపైరు నేలవాలి నీట మునిగింది. తిరువూరు ఆర్టీసీ బస్టాండులో ప్లాట్‌ఫారం మీదకు వరద చేరి ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్మాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. వరి, పత్తి పంటలు వరద ముంపునకు గురయ్యాయి. పెనుగంచిప్రోలులోని లింగగూడెం వద్ద గండివాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పెనుగంచిప్రోలు–లింగగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముండ్లపాడు వద్ద వాగు పొంగడంతో పెనుగంచిప్రోలు–ముండ్లపాడు, శనగపాడు–నందిగామకు రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్య పేట మండలంలోని పోచంపల్లి గ్రామం వద్ద చప్టా పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చిల్లకల్లు జంగాల కాలనీలోకి వరదనీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందిపడ్డారు. అలాగే మునేరు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి.
గన్నవరం నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మినుము పంటలకు నష్టం వాటిల్లింది. గాలులకు విద్యుత్‌లైన్లు ధ్వంసమై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పెనమలూరు నియోజకవర్గంలో పలు పంటలకు నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలంలో 1448 హెక్టార్లలో చిరుపొట్ట, కంకిదశలో ఉన్న వరి పొలాలు నేలవాలాయి. కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో వరికి నష్టం వాటిల్లింది. నియోజకవర్గం వ్యాప్తంగా 30కిపైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దావులూరు, మద్దూరు, గొడవర్రు, ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో 50 ఎకరాల్లో అరటి తోటలు, ఈడుపుగల్లు, మద్దూరు గ్రామాల్లో పది ఎకరాల్లో తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి.
డ్రోన్‌తో తుపాను నష్టం అంచనాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తుపాను ధాటికి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. భారీ ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గన్నవరం–విజయవాడ జాతీయ రహదారిపైన రామవరప్పాడు సమీపంలో వరద నీరు చేరింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే తరుణంలో మోంథా తుపాను రూపంలో రైతు కష్టాన్ని తుడిచిపెట్టేసింది.
ప్రాథమికంగా పంట నష్టం వివరాలు..
నియోజకవర్గాల వారీగా..
పంట కన్నీరు!
పంట కన్నీరు!
పంట కన్నీరు!


