ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చర్యలు
ఎన్టీఆర్ జిల్లా తుపాను ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపానును ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా తుపాను ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ శశిభూషణ్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించి, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్తును ఎదుర్కోవడానికి అవసరమైన పొక్లయినర్లు, ట్రాక్టర్లు, యంత్రాలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుపాను వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కీలక శాఖల సిబ్బంది తుపాను ప్రతిస్పందన చర్యలలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు ఏర్పా టు చేశారని, క్షేత్రస్థాయి యంత్రాంగమంతా సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు. అవసరమైన యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉన్నాయని, ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఇది తీవ్ర తుపాను అని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఏర్పాట్లు, చర్యలపై తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని చెప్పారు.
నిరంతర పర్యవేక్షణ..
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ అవేర్ వెబ్‌సైట్ ద్వారా తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తుపాను ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా కాలువల్లోని నీటిని నియంత్రిస్తున్నామని, బుడమేరుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. రైతులు పంట కోతలు కోయరాదని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.


