కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను నేపథ్యంలో విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయం, ఇరిగేషన్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో విపత్తును ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా విజయవాడ అర్బన్‌లోని కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడేందుకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి.. ముప్పు ఉన్న ఆవాసాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. అవసరమైన మందులతో పాటు 108, 104 ద్వారా సమర్థవంతంగా సేవలందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని చిట్టినగర్ రాకేష్ ఈఎం హైస్కూల్‌లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.
కొండ ప్రాంతాల్లో అప్రమత్తం..
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మోంథా తుపాను నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు సూచించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీపేట, టేనర్‌పేట, ప్రైజర్‌పేట, టీఎంహెచ్ స్కూల్ అడ్డరోడ్డు కొండ ప్రాంతాల్లో మంగళవారం సీపీ పర్యటించారు. కొండ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న నివాసాలను గుర్తించి తక్షణమే అందులో నివాసం ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలోని కొండ ప్రాంతాల వారికి సమాచారం చేరవేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసులు, కార్పొరేషన్, రెవెన్యూ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. నగరంలో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులకు ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని, హోర్డింగ్‌ల వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ వెంట వెస్ట్ ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్, కొత్తపేట సీఐలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి


