కృత్తివెన్నులో వణుకు
కృత్తివెన్ను: బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంథా తుపాను ప్రభావం మండలంపై తీవ్రంగా ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా తీవ్రమైన గాలులతో పాటు వర్షం కురుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం తీర గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు గ్రామాల ప్రజలను కేంద్రాలకు తరలించారు. తుపాను తీవ్రతతో కృత్తివెన్ను మండలం పెద్ద గొల్లపాలెం బీచ్‌లో సముద్రం నీరు 100 మీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చింది. సముద్రం బాగా పొంగడంతో ఉప్పుటేరులు, ఏటిపాయలు నీటి మట్టం పెరిగి ప్రధాన రహదారులు నీట మునిగిపోయాయి. లక్ష్మీపురం నుంచి పోడు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఇంతేరు గ్రామపంచాయతీ పార్వతీపురం రహదారికి వరద పోటు కారణంగా గండి పడే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారుల పర్యవేక్షణలో సిమెంట్ బస్తాలతో రక్షణ ఏర్పాటు చేశారు. పునరావాస శిబిరాలతో పాటు లోతట్టు ప్రాంతాలను మచిలీపట్నం డీఎస్పీ రాజా, రూరల్ సీఐ నాగేంద్రకుమార్, కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబులు సిబ్బందితో పరిశీలించారు.


