మల్లేశ్వరునికి సహస్ర లింగార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారికి మంగళవారం విశేష అభిషేకాలు, అర్చనలు, దీపార్చనలు నిర్వహించారు. స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శాంతి కల్యాణ వేదిక వద్ద సహస్ర లింగార్చన జరిగింది. ఆలయ అర్చకులు పుట్టమన్నుతో శివాకృతులను సిద్ధం చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గులాబీలు, చామంతులు, కలువ పూలు, శంఖు పుష్పాలు, సన్నజాజులు, గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించారు. సహస్ర లింగార్చనలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారికి మహా నివేదన, పంచహారతుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ నిర్వహించారు. శ్రీ గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు దీపాలంకరణ సేవ అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయా సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
తుపాను నేపథ్యంలో ఘాట్‌రోడ్డు మూసివేత
మంగళవారం సాయంత్రం నుంచి వర్షం తీవ్రత అధికం కావడంతో దుర్గగుడి ఘాట్‌రోడ్డును మూసివేశారు. తుపాను ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఘాట్‌రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు కనకదుర్గనగర్, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని సూచించారు.


