
ఆధునిక సాంకేతికతతో పటిష్ట బందోబస్తు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఆయన బుధవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్యూలైన్‌లు, భక్తుల రద్దీ వంటి అంశాలను పరిశీలించారు. డీసీపీ కె.జి.వి.సరిత క్యూలైన్‌లను పరిశీలించి పోలీసు అధికారులు, దుర్గగుడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. ఎంతో వ్యయప్రయాసలు పడుతూ వచ్చే దివ్యాంగులు, వృద్ధులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే సదుద్దేశంతో పోలీస్ సేవాదళ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తగు ఆదేశాల జారీ చేశారు. పున్నమీ ఘాట్‌లో ఉత్సవాలకు సైతం ఉపరాష్ట్రపతి వెళ్లిన దృష్ట్యా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు.