కృష్ణమ్మ విలవిల.. కాసులు గలగల
ఇబ్రహీంపట్నం: కూటమి అధికారంలోకి వచ్చాక ఆయా పార్టీల నేతలు ఇసుకను ఆర్థిక వనరుగా మార్చుకున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుక తవ్వుతున్న కూటమి నేతల చేతుల్లో కృష్ణానది విలవిల్లాడుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ నదీ గర్భంలో డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తు న్నారు. ఆరునెలల క్రితం మైనింగ్, రెవెన్యూ అధికారులు ఫెర్రీ రేవులో ఆకస్మిక దాడులు చేయడంతో కొద్ది కాలం తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే ప్రజాప్రతినిధి అండదండలతో తవ్వకాలు పునఃప్రారంభమయ్యాయి.
వాల్టా చట్టం ప్రకారం కృష్ణానదిలో పడవల ద్వారా ఇసుక తవ్వాలంటే వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవాలి. ఒకవేళ అనుమతులు ఉన్నప్పటికీ నదిలో నీటి మట్టానికి 3.5 మీటర్ల లోతు లోనే మ్యాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు జరపాలి. అయితే ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రెడ్జింగ్ యంత్రాలు కలిగిన పడవలతో నదిలో రిగ్ బోరు ద్వారా యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. రిగ్‌బోరుతో ఇసుక తోడటం ద్వారా కృష్ణానది గర్భానికి తూట్లు పొడుస్తున్నారు. డ్రెడ్జింగ్ యంత్రాల తవ్వకాలతో నదిలో పెద్దసైజు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గుంతలతో భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాల్లో బోరు పంపుల్లో నీరు ఇంకిపోతోంది.
ప్రభుత్వం అనుమతించిన రేవు నుంచే తవ్వకాలు జరిపాలి. ఇసుక అవసరమైన వ్యక్తులు గ్రామ/వార్డు సచివాలయం నుంచి అనుమతి పత్రం పొందాలి. అనుమతించిన రేవులో ఇసుక లోడింగ్ సమయంలో సచివాలయ అనుమతి పత్రం ఉంటేనే ట్రాక్టర్‌కు లోడింగ్ చేయాలి. ఇసుక దిగుమతి ప్రాంతానికి వెళ్లే వరకు సచివాలయ అనుమతి పత్రం ట్రాక్టర్ డ్రైవర్ వద్ద ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా స్థానిక రెవెన్యూ పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు ట్రాక్టర్‌లు, ఇసుక లోడింగ్ యంత్రాలపై కేసులు నమోదు చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ఇవేమీ లేకుండానే అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు ఇక్కడ కనిపించడంలేదు.
ఫెర్రీ వద్ద అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు డ్రెడ్జింగ్ యంత్రాలతో నదీగర్భంలో ఇసుక సేకరణ వాల్టా చట్టం నిబంధనలు అతిక్రమించిన అక్రమార్కులు రూ.లక్షల్లో వెనకేసుకుంటున్న కూటమి నాయకులు
నదీగర్భాన్ని తోడేస్తున్న ఇసుకాసురులు
వాల్టా చట్టానికి తూట్లు
ఇసుక తవ్వకాల నిబంధనలు గాలికి
రోజుకు రూ.లక్షల్లో సంపాదన
కృష్ణానది నుంచి తవ్విన ఇసుకను రోజుకు 500 ట్రాక్టర్లు అక్రమ మార్గాన తరలించి రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఒక్కొక ట్రాక్టర్ లోడింగ్‌కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాదారుల నుంచి మునిసిపాలిటీ ఆశీలు టెండర్ దారులు ట్రాక్టర్‌కు రూ.100 లెక్కన వసూలు చేస్తూ అక్రమ సంపాదనలో భాగమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాలు అరికట్టాల్సిన వారే అక్రమ వసూళ్లకు పాల్బడటం విడ్డూరంగా ఉంది. ఇసుక రవాణాకు ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండ టంతో మైనింగ్ రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మైనింగ్ ఏడీ వీరాస్వామి ఆరు నెలల క్రితం ఇదే ఇసుక రేవులో దాడిచేసి 24 ట్రాక్టర్లు, 18 క్రేన్‌లు, 10 పడవలను సీజ్ చేసి డ్రైవర్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా తిరిగి యథేచ్చగా ఇసుక రవాణాతో అక్రమ సంపాదనకు తెరతీశారు.