
పర్యాటకుల పులకింత..
బంగాళాఖాతం –కృష్ణానది సంగమ తీరంలో లైట్‌హౌస్ మడ అడవుల సోయగం నదీ తీరాన రామలింగేశ్వర మండపం
ప్రకృతి పలకరింత..
●ఆహ్లాదంగా నాగాయలంక తీరం● సూర్యాస్తమయం సందర్శకులకు నిత్య వసంతం
●పెరుగుతున్న పర్యాటకులు
నాగాయలంక: మండలంలోని తీర ప్రాంతం పర్యాటకులకు పులకింత కలిగిస్తుంది. ప్రకృతి రమణీయత మధ్య సందర్శకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక అనుభూతికి, ఆహ్లాదకర సందర్శనకు దక్షిణ బంగాళాఖాతం, పశ్చిమ కృష్ణా పరీవాహక తీర ప్రాంతం నిత్యం సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. దివిసీమ ద్వీపంతో అనుసంధానమైన నాగాయలంక మండలంలో మరో రెండు దీవులు (ఎదురుమొండి– ఈలచెట్లదిబ్బ) భౌగోళికంగా ఈ ప్రాంత పర్యాటక ఔన్నత్యానికి భరోసా ఇస్తున్నాయి. నిత్యం ఆహ్లాదకరం చేకూరుస్తూ కృష్ణానది, నౌకా దిక్సూచి లైట్‌హౌస్, స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్, నవలంక పర్యాటక వేదికలయ్యాయి. గ్రామ పంచాయతీ సహకారంతో స్వచ్ఛ నాగాయలంక సొసైటీ టీమ్ సఫలం కావడంతో స్వచ్ఛతా పర్యాటకానికి ఎనలేని ప్రాచుర్యం చేకూరింది. 2016 పుష్కరాల తర్వాత ఈ ఘాట్‌ను సంరక్షించడంలో స్వచ్ఛ సేవా కార్యకర్తలు కీలకపాత్ర వహించటంతో క్రమేణా సందర్శకుల రాకకు ప్రాధాన్యం పెరిగింది. సందర్శకులు కృష్ణానదిలో బోటు షికారు చేసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రైవేటు బోట్‌లను కిరాయికి మాట్లాడుకుని సరదాగా నదిలోకి సమీపంలోని నవలంకలోకి వెళ్లి రౌండ్స్ కొడుతున్నారు. ఈ 17 ఎకరాల ఐలెండ్‌ను ఆధునిక ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లకు సైతం వినియోగిస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది ఆవల పశ్చిమ తీరంలో ప్రతి నిత్యం కనిపించే సూర్యాస్తమయ విభిన్న దృశ్యాలకు సందర్శకులు మంత్ర ముగ్ధులవుతూ ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేయడం పరిపాటిగా మారింది.
దృష్టి పెట్టని పర్యాటక శాఖ....
ఇంతగా పర్యాటక వైచిత్యం కనిపిస్తున్నా సంబంధి పర్యాటకశాఖ మాత్రం ఇటువైపు దృష్టి పెట్టడంలేదు. పర్యాటక శాఖ రూ.1.25 కోట్లతో ఫుడ్ కోర్టు భవనాన్ని 90 శాతం పూర్తి చేసినప్పటికీ నిర్వహణ విస్మరించి టీడీపీ నాయకులకు అప్పగించడం గమనార్హం. అన్ని జాగ్రత్తలతో పర్యాటక శాఖ ఇక్కడ బోటు షికారు పాయింట్ నిర్వహిస్తే మంచి ఆదరణ అభిస్తుందని సందర్శకులు అంటున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నెలకొల్పిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ జలక్రీడల శిక్షణ చాలాకాలంగా ఆగిపోయింది. సందర్శకుల దిక్సూచిగా కూడా అలరిస్తున్న మరో పర్యాటక సువర్ణావకాశం కృష్ణా సాగర సంగమ తీరంలో ఆకర్షించేది కేంద్ర నౌకాయాన శాఖకు చెందిన నాగాయలంక లైట్‌హౌస్. కృషానది దక్షిణ పాయ నాగాయలంక దిగువున మరో మూడు పాయలుగా చీలిక ఏర్పడి సాగర సంగమం చెందే సమీపంలో ఈ దీప స్తంభం విశేషంగా అలరిస్తుంది. సొర్లగొంది, గుల్లలమోద నుంచి సముద్ర పాయల్లో బోట్‌లపై ప్రయాణిస్తే లైట్‌హౌస్ పరిసరాల్లో విస్తరించిన వేలాది ఎకరాల మడ అడవుల సౌందర్యం తనివితీరా చూడవచ్చు. దశాబ్దాల కలగా కృష్ణానదిపై తలపెట్టిన ఎదురుమొండి వంతెన నిర్మాణం జరిగితే రెండు దీవుల నడుమ ఉన్న ఈప్రాంతం అలరించే పర్యాటక ప్రదేశంగా మారడంలో అతిశయోక్తి ఉండదు.

పర్యాటకుల పులకింత..

పర్యాటకుల పులకింత..

పర్యాటకుల పులకింత..

పర్యాటకుల పులకింత..

పర్యాటకుల పులకింత..