సెంటర్(మచిలీపట్నం): నేటి ప్రపంచంలో వెలుగు చూస్తున్న భయంకరమైన వైరస్‌ల బారి నుంచి ప్రజల ప్రాణాలు ఫార్మాసిస్టులు కాపాడుతున్నారని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రపంచ ఫార్మసీ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం ఫార్మా అని, అందులో రూ.3 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు జీతం పొందేందుకు అవకాశం ఉందన్నారు.
అనంతరం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.ప్రసాదరెడ్డి ఫార్మా రంగంలో దేశీయంగా చోటుచేసుకుంటున్న మార్పులను వివరించారు. తొలుత ఫార్మసీ పితామహుడుగా పేరొందిన స్కాఫ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ఫార్మసీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గమ్మను బంగారు వాకిలి నుంచి దర్శించుకున్న కలెక్టర్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు క్యూలైన్‌లో వెళ్లి బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల తరువాత వీఐపీ టైం స్లాట్ ముగిసిన తరువాత క్యూలైన్ ద్వారా బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీఐపీ దర్శనాలకు దేవస్థానం కేటాయించిన సమయాల్లో మాత్రమే దర్శనం చేసుకోవాలని సూచించారు. వీఐపీలు గర్భగుడిని కాకుండా బంగారు వాకిలి దర్శనం చేసుకుంటే సామాన్య భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించొచ్చని పేర్కొన్నారు.
బందోబస్త్ ఏర్పాట్ల పరిశీలనలో డీజీపీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శ్రీదుర్గామళ్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని కమాండింగ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక అంశాలను డీజీపీ గురువారం పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆయనకు సీసీ కెమెరాలను చూపిస్తూ ఆయా ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లు, బందోబస్తు గురించి వివరించారు. ఆధునిక ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, రద్దీ సమయంలో తీసుకునే చర్యలు ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను వివరించారు.

ఫార్మసిస్టులు ప్రాణదాతలు