
ప్రదర్శనకే సరి.. ప్రేక్షకులేరి మరి..!
విజయవాడ కల్చరల్: వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేపట్టిన విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు స్పందన కరువైంది. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం, దుర్గాపురంలోని సంగీత కళాశాలలో మంగళవారం నృత్యప్రదర్శన, సంగీత కచేరి, హరికథలు ప్రదర్శించారు. అయితే ఈ రెండు కేంద్రాల వద్ద ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చినా, ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. సంగీత కళాశాలలో పట్టుమని 50 మంది ప్రేక్షకులు కూడా లేరు. సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహణ బాధ్యతలను టీడీపీ నాయకుడు వర్ల రామయ్య, తెలుగు సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ పొగడపాటి తేజస్వి, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులకు అప్పగించారు. వారు కనీసం కళాకారులకు మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. ఉత్సవ్ నిర్వాహకులకు తెలుగు ఆవశ్యకతపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్షింతలు వేసినా ఇప్పటికీ కార్యక్రమాల బోర్డు ఆంగ్లంలోనే ఉండటం గమనార్హం.