
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు
బీజేపీ తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
కృష్ణలంక (విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విదేశాంగ విధానం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన పరిస్థితులు–సీపీఎం వైఖరిపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల వామపక్ష ఉద్యమానికి గురుతర బాధ్యత ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు బీజేపీకి సాగిలపడుతున్నాయని తెలిపారు. ఇదే పద్ధతి కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు అవకాశం ఇచ్చిన వారవుతారని అన్నారు. ఈ ఏడాది కాలంలో భారత రాజకీయాల్లో వస్తున్న పెనుమార్పులు, అభ్యుదయ, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు వారి పాత్రను ముందుకు తీసుకెళ్లడంలో ఏచూరి లేని లోటు కనిపిస్తోందన్నారు. ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ప్రతిపక్షాలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఒక తాటిపైకి వచ్చాయంటే వామపక్షాలు, అందులోనూ సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించడం వలనే సాధ్యమైందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులకు ప్రజాస్వామ్యం పట్టడం లేదన్నారు. భూములు యథేచ్ఛగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సదస్సులో సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.