
రైళ్లలో స్నాచింగ్‌లు.. పాత నేరస్తుడు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో వరుస దొంగతనాలు, మహిళల మెడలోని బంగారు ఆభరణాల స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్‌పీ) అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఫతే ఆలీబేగ్‌తో కలసి జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జె.వి రమణ వివరాలు వెల్లడించారు.
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో..
తిరుపతికి చెందిన బండి రాజ్యలక్ష్మి ఆగస్టు 23న తిరుపతి నుంచి వరంగల్లుకు పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడలో ఆగి బయలుదేరే సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు నానుతాడును తెంచుకుని కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యాడు. అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించి రెండు రోజుల తరువాత విజయవాడ చేరుకుని జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విజయవాడ ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరస్తుడి కోసం గాలింపు చేపట్టారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షించడం, పాత నేరస్తులను విచారించడం ద్వారా చోరీకి పాల్పడింది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్‌కు చెందిన తండ్రికంటి రమేష్‌గా గుర్తించారు. ఇతనిపై గతేడాది విజయవాడ స్టేషన్‌లో స్నాచింగ్ కేసులోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ముమ్మర గాలింపు..
పోలీసులకు అందిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం హైదరాబాద్, వరంగల్లు, ఖమ్మంలో గాలింపు చేపట్టినా పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం నిందితుడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద బంగారు ఆభరణాలను విక్రయించేందుకు తిరుగుతుండగా.. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్నాచింగ్‌కు పాల్పడిన లక్షరూపాయల విలువ చేసే 25 గ్రాముల బంగారు నానుతాడుతో పాటుగా గతంలో చోరీ చేసిన నాలుగు లక్షల విలువైన రెండు సూత్రాలతో కూడిన 40 గ్రాముల బంగారు నానుతాడును కూడా పోలీసులు రికవరీ చేశారు.
రూ. 5లక్షల విలువైన
బంగారు ఆభరణాలు స్వాధీనం