
ప్రగతి సూచికలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ విభాగాల కీలక ప్రగతి సూచికల (కేపీఐ) పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నాలుగు సూచికలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యాన శాఖ అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పన, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి సంబంధించిన అంశాల్లో నిర్దేశించిన నెలవారీ, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సగటు వేతనం రూ. 307 ఉపాధి హామీ శ్రామికులకు అందేలా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్నారు.
ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం వేసే ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాదికి జిల్లా మొత్తంమీద 4వేల ఎకరాలను, ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 20 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇప్పటివరకు 3,741 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా మునగ సాగుకు 894 ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. మండలాల వారీగా లేబర్ మొబిలైజేషన్, సీసీ రహదారుల నిర్మాణం, పశువుల షెడ్లు, జీవాల షెడ్ల నిర్మాణం, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం తదితరాలపైనా సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.