ఆయుష్ శాఖ కింద ఎన్టీఆర్ జిల్లాలో 16 వైద్యశాలలు
వైద్యులు లేక మూతబడిన పుల్లూరు హోమియో ఆస్పత్రి
సిబ్బంది లేక అంతంతమాత్రంగా అందుతున్న వైద్య సేవలు
జి.కొండూరు : కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి పచ్చజెండా ఊపి, పేదలకు అవసరమైన వైద్యాన్ని నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామగ్రామానా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. బార్లు పనివేళలను సైతం పెంచిన ప్రభుత్వం అర్ధరాత్రి వరకూ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ఆయుర్వేద, హోమియో వైద్యశాలల్లో సిబ్బంది లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఈ ఆస్పత్రులపై నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
మూతబడిన రెండు వైద్యశాలలు
వైద్యాధికారులు లేక ఎన్టీఆర్ జిల్లాలో ఒక హోమియో వైద్యశాల, ఒక యునాని ఆస్పత్రి మూతబడ్డాయి. మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో నాలుగు నెలల పైబడి వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ బదిలీపై వెళ్లగా మరో డాక్టరును ప్రభుత్వం నియమించలేదు. సిబ్బంది కూడా లేకపోవడంతో ఆస్పత్రి మూతబడింది. ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆస్పత్రిని వెంటనే తెరిచి వైద్య సేవలు కొనసాగించాలని సీపీఎం నాయకులు స్థానికులతో కలిసి సోమవారం ధర్నా చేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో నిర్వహిస్తున్న యునాని ఆస్పత్రిలో వైద్యాధికారి లేక కొన్నేళ్లుగా వైద్య సేవలు నిలిచిపోయాయి.
సిబ్బందిలేక వెలవెల
నందిగామ, గంపలగూడెం, మైలవరం మండలాల పరిధిలో మూడు హోమియో వైద్యశాలలు ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి, జగ్గయ్యపేట మండలంలో వేదాద్రి, పెనుగంచిప్రోలు మండలంలో అనింగండ్లపాడు, కొణకంచి, నందిగామ మండలలో నందిగామ, పెద్దవరం, వీరులపాడు మండలంలో అల్లూరు, కంచికచర్ల మండలంలో పరిటాల, ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి, జి.కొండూరు మండలంలో వెల్లటూరులో పది ఆయుర్వేద వైద్య శాలలు ఉన్నాయి.
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద కంచి కచర్ల మండలం పెండ్యాలలో యునాని ఆస్పత్రి, కంచికచర్లలో యోగా నేచరోపతి ఆస్పత్రి, మైలవరంలో ఆయుర్వేద ఆస్పత్రి ఉన్నాయి. ఈ పదహారు ఆస్పత్రుల్లో ఒక్కొక్క ఆస్పత్రిలో వైద్యాధికారితో పాటు ముగ్గురు సహాయక సిబ్బంది ఉండాలి. గూడవల్లి, పెద్దవరం, నందిగామ, కొండపల్లి ఆస్పత్రుల్లో మాత్రమే వైద్యాధికారితో పాటు ఒక్కొక్కరు చొప్పున సిబ్బంది ఉన్నారు. మిగిలిన 12 వైద్య శాలల్లో సిబ్బందే లేరు. ఆయుష్ శాఖ కింద నడుస్తున్న విజయవాడలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యశాల, డాక్టర్ నోరి రామశాస్త్రి ఆయుర్వేద వైద్య కళాశాలలో కూడా సరిపడా సిబ్బంది లేక ఇక్కట్లు తప్పడం లేదు.
డాక్టర్‌ను నియమించాలి
ఏడేళ్లుగా దగ్గు, జలుబు, నొప్పులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో మందులు వాడుతున్నాను. డాక్టరు లేక కొన్ని నెలలుగా పుల్లూరులో హోమియో ఆస్పత్రి మూతపడింది. ఇంగ్లిషు మందులు వాడలేక ఇబ్బంది పడుతున్నా. నాతో పాటు చాలా మంది ఆస్పత్రికి వచ్చి వెనక్కి పోతున్నారు. అధికారులు స్పందించి డాక్టర్‌ను నియమించాలి.
– వజ్రాల ధనలక్ష్మి, మంగాపురం, మైలవరం మండలం
ఇంగ్లిషు మందులతో ఇబ్బంది
నేను గత 15 సంవత్సరాలుగా హోమియో మందులను వాడుతున్నాను. పుల్లూరు గ్రామంలో ఉన్న హోమియో ఆస్పత్రిని మూసేయడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. ఇంగ్లిష్ మందులను వాడాలంటే ఇబ్బందిగా ఉంది. హోమియో మందులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి డాక్టరును కేటాయించి ఆస్పత్రిని తెరవాలి.
– చిలుకూరి సుబ్బారెడ్డి, చిలుకూరివారిగూడెం, మైలవరం మండలం
నిర్లక్ష్యం తగదు
ఆయుర్వేద, హోమియో వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వ పర్యవేక్షణ లేక ఆస్పత్రులు వెలవెలబోతున్నాయి. పుల్లూరు హోమియో వైద్యశాలకు ఆరు నెలలుగా తాళం తీయడం లేదు. హోమియో వైద్యానికి ఆలవాటు పడిన వారు ఇంగ్లిషు మందులు వాడలేక నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వైద్యులను, సిబ్బందిని కేటాయించాలి.
– చాట్ల సుధాకర్, సీపీఎం మండల కార్యదర్శి, మైలవరం

వైద్యులు లేక మూతబడిన పుల్లూరు హోమియో ఆస్పత్రి

బార్లు బార్లా.. వైద్యం బోర్లా