ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణం అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధిచేశారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటలకు పవిత్ర కృష్ణానది నుంచి జలాలను తీసుకొచ్చి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఉప ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను శాస్త్రో క్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు ఈఓ శీనానాయక్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సర్వ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులను కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గ్రహణం నేపథ్యంలో తెల్లవారుజామున జరగాల్సిన సుప్రభాత, వస్త్రాలంకరణ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు.
తిరుపతమ్మ ఆలయంలో..
పెనుగంచిప్రోలు: చంద్ర గ్రహణం అనంతరం పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారి ఆలయం సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు తెరుచుకుంది. గ్రహణం సందర్భంగా 15 గంటల పాటు ఆలయాన్ని కవాట బంధనం చేశారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి అర్చకులు సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు.
పీహెచ్‌సీలో తనిఖీలు
పెనమలూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని ప్రశ్నించారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉన్నాయి అని ఆరా తీశారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. జ్వరాలు ఉన్నందున ఫీల్డ్ లెవ ల్‌లో స్టాఫ్ సర్వే చేస్తున్నారా అని అడిగారు. ఆస్పత్రిలో డెలివరీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు కూడా చేయాలని సూచించారు. ఆర్‌డీవో హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీ డీవో డాక్టర్ బండి ప్రణవి, మండల వైద్యాధికారి సాయిలలిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు : కలెక్టర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎరువులు అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ఎరువుల డీలర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఎరువుల విక్రయాలు సాగాలని స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు తెలపాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో ఎరువుల పంపిణీ వ్యవస్థను కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ కేంద్రానికి రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎరువుల దుకాణాలకు వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, వివిధ కంపెనీల డీలర్లు పాల్గొన్నారు.

దుర్గగుడిలో ప్రత్యేక పూజలు