
ఇమామ్, మౌజన్లకు ‘గౌరవం’ ఇవ్వండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు పెండింగ్ గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. గౌరవ వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మైనార్టీ విభాగం ఆధ్యర్యంలో మైనార్టీలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాషా, హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇమామ్‌లు, మౌజన్‌లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నెలకు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం నిరంతరాయంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి గౌరవ వేతనం చెల్లింపులు నిలిచిపోయాయన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల వేతన బకాయి ఉందన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న ఇమామ్‌లు, మౌజన్‌లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మసీదు కమిటీలు కూడా చెల్లింపులు చేయలేని స్థితిలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో వారికి క్రమం తప్పక గౌరవ వేతనాలు అందాయని గుర్తుచేశారు. బకాయిలు తక్షణమే ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో ప్రతి నెలా గౌరవ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న ఇమామ్‌లు, మౌజన్ లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, కార్పొరేటర్ ఎండీ ఇర్ఫాన్, రఫీ, మైనార్టీ నాయకులు, పలువురు ఇమామ్‌లు, మౌజన్‌లు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం
ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన