
రైతులను మోసగించిన కూటమి ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ రైతులకు మద్దతుగా 9న అన్నదాత పోరు కార్యక్రమం
గుణదల(విజయవాడ తూర్పు): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం రైతులనూ ఘోరంగా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత జన జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందక తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నం పెట్టే రైతుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. పంట దిగుబడులు సక్రమంగా లేక, గిట్టుబాటు ధర అందక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతు భరోసా ద్వారా రైతులకు వెన్ను దన్నుగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతన్నలపై పగ సాధిస్తోందన్నారు. మద్దతు ధర ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో యూరియా కోసం రైతన్నలను రోడ్డెక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అందుకే రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ముందుకొచ్చిందన్నారు. ఈ నెల 9వ తేదీన రైతులకు మద్దతుగా అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలను సమర్పిస్తామన్నారు. రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర కార్యదర్శి నంబూరి రవి, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, రైతు సంఘాల నాయకులు సాయిబాబా, రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైతులను జైల్లో పెడతారా..?
యూరియా అడిగితే రైతులను జైల్లో పెడతా మంటూ ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటని దేవి నేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవాల్సింది పోయి వారినే జైల్లో పెడతామంటూ బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్న రైతులను కించపరుస్తూ విమర్శించడం కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కూటమి నేతలు వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కాక తప్పదన్నారు.