
8న అప్రెంటీస్ మేళా
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తమ కళాశాల ఆవరణలో ఈ నెల ఎనిమిదో తేదీన అప్రెంటీస్ మేళా జరుగుతుందని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో వివిధ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ సంస్థల్లో అప్రెంటీస్ చేసేందుకు అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్‌ల విద్యార్థులతో పాటుగా 2025 సంవత్సరంలో ఐటీఐ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు, రెండు పాస్‌ఫోర్ట్ సైజు ఫొటోలు, పాన్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కులధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్‌తో పాటుగా మూడు సెట్ల జిరాక్స్ కాపీలతో ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో జరిగే అప్రెంటీస్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో
కార్మికుడు మృతి
జి.కొండూరు: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పని చేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వెల్లటూరు గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. అల్లూరిసీతారామరాజు జిల్లా, జీకే వీధి మండల పరిధిలోని ఈకోడిసింగి గ్రామానికి చెందిన వంతల సన్యాసిరావు(38) మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పని చేసేందుకు ఈ నెల ఒకటో తేదీన వచ్చారు. ఇటుక బట్టీలో రెండవ తేదీ నుంచి పనిలో చేరిన ఈ ఆరుగురు కార్మికులు, గురువారం ఇటుక బట్టీలో ఉన్న పాత షెడ్డును తొలగించి మరో చోట నిర్మించే పనులను చేపట్టారు. ఈ క్రమంలో సన్యాసిరావు తొలగించిన షెడ్డు నుంచి ఇనుప రాడ్డుని పైకి తీసి తరలిస్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్‌లైనుకు తాకింది. విద్యుదాఘాతానికి గురైన సన్యాసిరావు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సన్యాసిరావుని వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.