
రాజీనామా బాటలో రేషన్ డీలర్లు!
కష్టం చేయలేమంటూ మనోవేదన కమీషన్ పెంచాలని వినతి
పెడన: కొందరు రేషన్ డీలర్లు రాజీనామాల బాటలో పయనిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వెట్టిచాకిరీ తాము చేయలేమని తేల్చి చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కమీషన్ అతి తక్కువగా ఉంటుందని... తమతో చేయించే పని ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. కమీషన్ పెంచాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం ఉండటం లేదని అంటున్నారు. ఎప్పటికి పెంచుతారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పని చేయడం కష్టమని, తప్పుకోవడమే మేలని వెల్లడిస్తున్నారు. పెడన పట్టణంలో జూన్ నెలలో ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించిన షాపు నెంబరు ఏడు డీలరు ఐవీ పద్మావతి రాజీనామా చేశారు. ఈ షాపును విజేత డ్వాక్రా గ్రూపునకు అప్పగించారు. గ్రూపు లీడరు పి.కృష్ణప్రియ బాధ్యతలు చేపట్టారు. మండల పరిధిలోని దావోజిపాలెం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కె.నాగమల్లేశ్వరరావు కూడా రాజీనామా అందజేశారు. అయితే ఈయన రాజీనామాను అధికారులు
ఇంకా ఆమోదించలేదు. పట్టణంలోని మరో మహిళా డీలరు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
గత ప్రభుత్వంలో హాయిగా...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే హాయిగా ఉన్నామని, ఇప్పుడు ఈ చాకిరీ చేయలేకపోతున్నామనే విషయాన్ని డీలర్లు పేర్కొంటున్నారు. గతంలో క్వింటాకు రూ.100 చొప్పున ఒక డీలరుకు సుమారు రూ.7వేలు నుంచి రూ.12 వేలు వరకు కమీషన్ వచ్చేది. ప్రస్తుతం వికలాంగులకు, 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధుల ఇళ్లకు తీసుకువెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేషన్ డీలర్లు ఒక హెల్పెర్‌ను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ హెల్పెర్‌కు రూ.5వేలు నుంచి రూ.6వేలు సమర్పించుకోవాల్సి వస్తుంది.
ఇంటింటికి రేషన్ తీసుకువెళ్లి ఇవ్వడానికి ఒక్కొ డీలరుకు 25 నుంచి 150 ఇళ్లకు వెళ్లి ఇంటింటికి రేషన్ అందించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనంపై ఆయా ఇళ్లకు తిరగడానికి పెట్రోల్ ఖర్చులు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వెచ్చిస్తున్నారు. అదనంగా చాకిరీ చేయాల్సి రావడంతో ఇంత కష్టం ఎందుకు..రాజీనామాయే బెటర్ అంటున్నారు.

రాజీనామా బాటలో రేషన్ డీలర్లు!