
కోరలు విప్పిన కాల్‌మనీ!
రూ.85 వేల అప్పునకు రూ.3 లక్షల వరకు వసూలు ఇంకా రూ.15 వేలు ఇవ్వలేదని తండ్రీ కుమారులపై దాడి పోలీసులను ఆశ్రయించిన బాధితులు వ్యాపారికి అండగా రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలో కాల్‌మనీ వ్యాపారులు మళ్లీ కోరలు విప్పుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో విచ్చలవిడిగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వనివారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇదే విధంగా తండ్రీ కుమారులపై కాల్‌మనీ వ్యాపారి దాడులకు తెగబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన బలసాని స్వామిదాస్ రియల్ ఎస్టేట్‌లో మధ్యవర్తిత్వం చేస్తుంటాడు, కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. కరోనా వైరస్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చింతా చందు అనే కాల్‌మనీ వ్యాపారి తల్లి వద్ద రూ.85 వేలు అప్పుగా తీసుకొని ఆమెకు నెల నెలా వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఆమె రెండేళ్ల క్రితం కాలం చేయడంతో ఆ సమయంలో కూడా అసలులో రూ.20 వేలు ఇచ్చారు. ఆ తరువాత ఆమె కొడుకు చందు తన తల్లికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగాడు. మరో రూ.40 వేలు మాత్రమే ఇవ్వాలని స్వామిదాస్ చెప్పగా అవన్నీ తన వద్ద కుదరదని, తమది కాల్ మనీ అని, లక్ష రూపాయలు కట్టాల్సిందేనని గొడవపడి భయపెట్టాడు. దీంతో చేసేది లేక లక్ష కడతామని ఒప్పుకున్నారు. గతేడాది బుడమేరు వరదల్లో అంతా నష్టపోయామని చెప్పినా కూడా వినకుండా మొత్తం రూ.3 లక్షలకు పైగా అసలు, వడ్డీల చొప్పున డబ్బులు కట్టించుకున్నారు.
చికిత్స చేయించు
కుంటున్న స్వామిదాస్
తలకు కుట్లు
పడిన లాజర్
రూ.15 వేల కోసం తలపగలకొట్టిన వైనం...
దఫదఫాలుగా అప్పు తీర్చుకుంటూ వస్తున్న స్వామి దాసు ఇంకా రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పారు. దానికి సరే అని చెప్పిన చందు ఆగస్టు 31వ తేదీన స్వామిదాస్‌కు ఫోను చేసి అసభ్యకరంగా తిడుతూ ఈ రోజే నాడబ్బులు ఇచ్చేయాలి లేకపోతే నిన్ను చంపేస్తా అంటూ కులం పేరుతో బూతులు తిట్టాడు. స్వామిదాసు వారి ఇంటి ముందు వేసిన వినాయకచవితి పందిరి వద్ద ఆదివారం రాత్రి కూర్చొని ఉండగా చందు ఒక్కసారిగా స్వామిదాసుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్వామిదాసు కుమారుడు తన తండ్రిని కొట్టవద్దంటూ అడ్డురాగా రాయితో అతని తల పగలకొట్టాడు. ఈ ఘటనలో స్వామిదాసు ముఖంపై, చేతికి, ఒంటిపై గాయాలుకాగా అతని కుమారుడు లాజర్ తలపగిలి కుట్లుపడ్డాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించగా చింతా చందు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. కాల్‌మనీ వ్యాపారులకు అండగా టీడీపీ నాయకులు రంగంలోకి దిగి కేసు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. వినాయక చవితి బందోబస్తు నేపథ్యంలో దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పుకొచ్చారు.

కోరలు విప్పిన కాల్‌మనీ!