
పోలీస్ గ్రీవెన్స్‌కు 83 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 83 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 83 ఫిర్యాదులు రాగా, వాటిలో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 35, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, కొట్లాటలపై 2, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలపై 20, దొంగతనాలకు సంబంధించి 3, ఇతర చిన్న వివాదాలపై 15 ఫిర్యాదులు అందాయి. కాగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు పంపి, సత్వరమే చర్యలు తీసుకోవాలని డీసీపీ ఉదయరాణి ఆదేశించారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి అర్జీ స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు చర్యలు
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): తీరప్రాంతాల్లో మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్రీన్ క్‌లైమెట్ ఫండ్స్ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పీతల సాగు, సముద్రనాచు సాగు, అలంకార చేపల పెంపకం, మైరెన్ ఫిష్ కేజ్ కల్చర్, మడ అడవుల పెంపకం, సంరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో తీరప్రాంతం కలిగిన జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి, జీవనోపాధులకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను వంటి తీరప్రాంత మండలాలు పీతల సాగుకు అవసరమైన ప్రాంతమని అందుకు అవసరమైన పీతలసీడ్‌ను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆసుపత్రిలోకి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపూడిలో చోటుచేసుకుంది. రాయనపాడుకు చెందిన మందా రాకేష్ రాడ్ బెండింగ్ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఆయనకు గొల్లపూడికి చెందిన లతతో వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగస్టు 29వ తేదీ సాయంత్రం వెస్ట్ బైపాస్ ఫ్‌లై ఓవర్ వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. అక్కడ నుంచి గొల్లపూడిలోని అత్తారింటికి వచ్చి తాను పురుగు మందు తాగిన విషయం తెలిపాడు. వెంటనే భవానీపురంలోని ఓ ఆసుపత్రిలో
చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.