
బుడమేరు ముంపు నివారణలో కూటమి వైఫల్యం
బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద ముంపు నివారణ చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ అర్బన్ సిటిజన్స్ ఫెడరేషన్ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ధ్వజమెత్తారు. బుడమేరు వరదల సందర్భంలో హడావిడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత శాశ్వత నివారణ చర్యలను విస్మరించిందన్నారు. బుడమేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతూ బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. బుడమేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, బాధితులందరికీ సహాయం అందించాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 2047 నాటికి ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, తక్షణ సమస్యగా ఉన్న బుడమేరు వరదను శాశ్వతంగా నివారించడానికి మాత్రం ప్రణాళికలు రచించడం లేదన్నారు. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో బనకచర్ల ప్రాజెక్టును నిర్మించటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. బుడమేరు వరద శాశ్వత నివారణకు ఎందుకు చర్యలు చేపట్టటంలేదని ప్రశ్నించారు, ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలు ఆందోళన చేయటానికి సిధ్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం ముంపు ప్రాంతాలకు చెందిన వివిధ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతి మెమోరాండం అందజేశారు. మిత్రా కమిటీ సిఫార్సుల ప్రకారం వెలగలేరు రెగ్యులేటర్ కు ఎగువన రిజర్వాయర్లు నిర్మించాలని, బుడమేరు డ్రైవర్షన్ ఛానల్ వెడల్పు పెంచి కనీసం 35,000 క్యుసెక్కులకు పెంచాలని, విజయవాడ నగరానికి ముంపు లేకుండా మరొక అదనపు కాలువ నిర్మించి వరద నీరు ఎప్పటికప్పుడు పోయేవిధంగా ఏర్పాటు చేయాలని, బుడమేరు లోతు, వెడల్పు పెంచి రెండు వైపుల రిటైనింగ్ వాల్ నిర్మించాలని, బుడమేరు పూడికల తీయించి రివెటింగ్ చేయించాలని కలెక్టర్‌కు ఇచ్చిన మెమోరాండంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జె. మంగపతి, యు. వి. కృష్ణయ్య, కార్పొరేటర్ సత్తిబాబు, ఎస్.కే. సలీమ్, పిల్లి మహేష్, వాసు, మాచర్ల లింగరాజు, కే.సరోజ, షకీల, పౌర సంక్షేమసంఘం నాయకులు బి.రమణారావు, పులి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.