ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యం!

Sep 1 2025 4:15 AM | Updated on Sep 1 2025 4:15 AM

ఇష్టారాజ్యం!

ఇష్టారాజ్యం!

ఇష్టారాజ్యం!

పొలాల లీజుకు సన్నాహాలు..

రాత్రి వేళల్లో తెలంగాణకు తరలింపు టన్ను రూ. 12వేల నుంచి 18వేల వరకూ పలుకుతున్న వైనం పంట పొలాలు లీజుకు తీసుకుంటున్న అక్రమార్కులు పట్టించుకోని అధికారులు

యథేచ్ఛగా కాకిరాయి అక్రమ రవాణా

జగ్గయ్యపేట: మట్టి, ఇసుక, గ్రావెల్‌ ఇలా కాదేదీ దోపిడీకి అనర్హం అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వంలో పరిస్థితి. అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వీరి దోపిడీ అధికంగా ఉంది. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఇనుము తయారీలో ముడి పదార్థంగా వినియోగించే కాకిరాయి(స్పాంజ్‌ ఐరన్‌) విరివిగా లభిస్తోంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు దానిని యథేచ్ఛగా పక్క రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది.

అటవీ ప్రాంత గ్రామాలలో..

జగ్గయ్యపేట మండలంలోని షేర్‌మహ్మద్‌పేట, రామచంద్రునిపేట, గండ్రాయి, తక్కెళ్లపాడు గ్రామాల్లోని అటవీ ప్రాంతాలలో పంట భూములు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కాకిరాయి అధికంగా లభ్యమవుతోంది. దీంతో కొందరు అక్రమార్కులు ఐరన్‌ స్పాంజ్‌ కర్మాగారాలకు తరలిస్తున్నారు. 2006–09 వరకు ఈ ప్రాంతాలలో కాకిరాయి కలాపాలు అప్పటి ప్రభుత్వ అనుమతితో విరివిగా సాగాయి. అంతే కాకుండా వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లోని ఐరన్‌ వోర్‌ కర్మాగారాలకు కూడా కాకిరాయి రవాణా సాగింది. అయితే 2009లో కొన్ని రాజకీయ కారణాలతో ప్రభుత్వం అనుమతులు నిలిపివేయటంతో పాటు కొన్ని కర్మాగారాలు నష్టాలలో ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

16 ఏళ్ల తరువాత తవ్వకాలు..

కాకిరాయి రవాణా పూర్తిగా నిలిపివేసి 16 ఏళ్లు గడిచిన తరువాత కూటమి ప్రభుత్వంలో అక్రమ రవాణా మళ్లీ ఊపందుకుంది. ఆయా గ్రామాల్లోని పొలాలు పూర్తిగా ఎర్ర నేలలు కావటంతో వర్షాధారమైనవి. వర్షాలు సకాలంలో కురిస్తేనే రైతులకు పంట దిగుబడి వస్తుంది. లేకుంటే నష్టాలు చూడాల్సిందే. దీనిని ఆసరా చేసుకుంటున్న అక్రమార్కులు ఆ రైతులకు డబ్బిచ్చి పొలాలను తీసుకుంటున్నారు.

కూలీలతో రాయి ఏరివేత..

కాకిరాయిని పొలాల్లో అక్రమార్కులు ప్రత్యేకంగా కూలీలతో ఏరిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో పొలాలలో రాయి పైకి తేలుతుంది. ఉదయం సమయంలో రాయిని కూలీలతో ఏరించి పొలాల్లో కుప్పలుగా పోస్తారు. రాత్రి వేళల్లో రాళ్ల కుప్పను ట్రాక్టర్‌ల ద్వారా సమీపంలోని తెలంగాణ రాష్ట్రం నేలకొండపల్లి మండలంలోని గట్టు కాచవరం, అప్పలనర్సాపురం మీదుగా సూర్యాపేట, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అంతే కాకుండా సమీపంలోని ఐరన్‌ ఇండస్ట్రీకి కూడా తరలిస్తున్నట్లు సమాచారం.

పట్టించుకోని అధికారులు..

గుట్టుచప్పుడు కాకుండా ఖనిజ సంపదను ఎటు వంటి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదు. మైనింగ్‌, అటవీ శాఖాధికారులు కూడా కనీసం కన్నెత్తి చూడకపోవటంతో అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారు. విలువైన ఖనిజ సంపదను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం..

అనుమతులు లేకుండా ఖనిజ సంపదను అక్రమ రవాణా సాగిస్తే చర్యలు తీసుకుంటాం. కాకిరాయి తరలింపుపై విచారణ జరుపుతాం. నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– వీరాస్వామి, మైనింగ్‌ ఏడీ, విజయవాడ

తక్కెళ్లపాడు, రామచంద్రునిపేట, గండ్రాయి గ్రామాల్లోని గాడుదల గుట్ట పంట పొలాలను లీజుకు తీసుకునేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కాకిరాయి చిన్నా, పెద్ద సైజులో ఉంటుంది. పొలంలో రెండు నుంచి మూడు, నాలుగు అడుగుల వరకు తవ్వకాలు చేస్తే కాకిరాయి బయటపడుతుంది. దీంతో అక్రమార్కులు సైజును బట్టి ధర నిర్ణయించి ఎకరం పొలం లీజుకు రూ. లక్షకు తీసుకునేలా రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement