
కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలు
డీఆర్వో లక్ష్మీనరసింహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలను రూపొందించారని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం అన్నారు. కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 (ఎస్‌ఐఆర్– 2026) ముందస్తు సన్నాహకాల్లో భాగంగా నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ నిర్వహించామన్నారు. జిల్లాలో 1,200 ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాన్ని హేతుబద్ధీకరించి కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు, సమీప పోలింగ్ కేంద్రంలో విలీనం చేయాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,792 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో 295 సెంటర్లలో 1,200 మంది ఓటర్లు మించి ఉన్నారన్నారు. అదనంగా ఉన్న ఓటర్లను సమీప కేంద్రంలో విలీనం చేసి కొత్తగా మరో 129 పోలింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించామన్నారు. వీటితో ప్రస్తుతం ఏర్పాటు చేసిన 129తో కలిపి జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,921కి చేరిందన్నారు. జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు. పోలింగ్ కేంద్రం వారీగా బూతు స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.