
విశ్రాంత బ్యాంకు ఉద్యోగి డిజిటల్ అరెస్ట్
పోలీసులమంటూ 72 గంటల పాటు వేధింపులు
రూ. 12లక్షలు కాజేసేందుకు స్కెచ్
బ్యాంకు ఉద్యోగుల అప్రమత్తతతో సైబర్ నేరగాళ్ల ప్రయత్నం విఫలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశ్రాంత బ్యాంకు ఉద్యోగిపై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు. డిజిటల్ అరెస్టు పేరుతో 72 గంటల పాటు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారు. వారి ఒత్తిళ్లకు భయపడిన ఆ రిటైర్డ్ ఉద్యోగి, తన పేరుపై ఉన్న వివిధ డిపాజిట్లలోని రూ.12 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసేందుకు సిద్ధమయ్యారు. డిపాజిట్‌లు క్యాన్సిల్ చేయడంపై అనుమానం వచ్చిన కేడీసీసీ బ్యాంకు మేనేజర్ ఎ. రమ్యకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ క్రైమ్ సీఐ బి. గుణరామ్ వెంటనే రంగంలోకి దిగి సైబర్ నేరగాళ్ల ప్రయత్నాన్ని విఫలం చేశారు.
పూర్తి వివరాలు ఇవి..
రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ చలసాని పూర్ణచంద్రరావు(74) మొగల్రాజపురం ప్రాంతంలో నివసిస్తుంటారు. ఆయనకు మూడు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల పేరుతో ఫోన్ చేసి ‘నీ అకౌంట్‌లో రూ.3కోట్లు పడ్డాయి.. నీ బ్యాంకు లావాదేవీలన్నీ మా వద్ద ఉన్నాయి, నీవు విదేశాలకు ఎవరెవరిని పంపుతున్నావో మాకంతా తెలుసు’ అంటూ బైదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా అకౌంట్ సీజ్ చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. వారి వేధింపులు తీవ్రరూపం దాల్చడంతో భరించలేని వృద్ధుడు తన ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.12 లక్షలు వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
బ్యాంక్ సిబ్బందికి అనుమానం..
విశ్రాంతి ఉద్యోగి కేడీసీసీ బ్యాంకు బ్రాంచికి వెళ్లి తన డిపాజిట్లు రూ.12 లక్షలు రద్దు చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇచ్చిన అకౌంట్‌కు బదిలీ చేయాలని బ్యాంకు సిబ్బందిని కోరారు. బ్యాంకు ఉద్యోగులకు అనుమానం రావడంతో ఎందుకు బదిలీ చేస్తున్నారని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు, భయాందోళనతో ఉండటాన్ని గుర్తించారు. దీంతో నగదు బదిలీ చేయకుండా విశ్రాంత ఉద్యోగికి నచ్చజెప్పేందుకు యత్నించగా వినలేదు.
సైబర్ పోలీసులకు సమాచారం..
విశ్రాంత ఉద్యోగి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ ఎ. రమ్యకృష్ణ సైబర్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన సీఐబి. గుణరామ్, కానిస్టేబుల్ జి. ఉదయభాను బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారుని వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలోనే సైబర్ నేరగాళ్లు మళ్లీ ఫోన్ చేయడంతో సీఐ గుణరామ్ ఫోన్ తీసుకుని వారిని హెచ్చరించడంతో ఫోన్ కట్ చేశారు. అనంతరం పోలీసులకు విశ్రాంత ఉద్యోగి 72 గంటలుగా తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వివరించారు. పోలీసులు బ్యాంకు సిబ్బంది ధైర్యం చెప్పడంతో ఆందోళన నుంచి బయటపడ్డారు. కాగా నగదు బదిలీపై అనుమానించి వెంటనే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ రమ్య కృష్ణ, ఇతర సిబ్బందిని సైబర్ పోలీసులు అభినందించారు.