
పరిటాల దాసాంజనేయ స్వామి ఆలయంలో చోరీ
10 కిలోల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు అపహరణ
కంచికచర్ల: జాతీయ రహదారి పక్కన కొలువై ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో జొరబడి స్వామి వారి వెండి ఆభరణాలు, నగదును దొంగిలించారు. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదైంది. నందిగామ రూరల్ సర్కిల్ సీఐ చవాన్‌దేవ్ కథనం మేరకు.. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో నేషనల్ హైవే పక్కన వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహం ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ఆలయ ఉత్తర వైపు ఉన్న ద్వారం తలుపు గొళ్లెం పగులకొట్టి గర్భగుడిలోకి జొరపడ్డారు. గర్భగుడిలో ఉన్న రూ.10 లక్షల విలువుగల పది కిలోల వెండి ఆభరణాలు (స్వామి వారి మకరతోరణం, వెండి కవచం, ఓంకారపు వెండి తొడుగు, పాదాలు, శటారి, వెండి బిందె, చిన్న వెండి విగ్రహం), రూ.40 వేల నగదును దోచు కెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున ఆలయానికి వచ్చిన అర్చకులు తలుపుల గొళ్లెం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ క్రైం ఏడీసీపీ రాజారావు, క్రైం ఏసీపీ వెంకటేశ్వర్లు, నందిగామ ఏసీపీ ఎ.బాలగంగాధర్ తిలక్, రూరల్ సీఐ చవాన్‌దేవ్, క్రైం ఎస్‌ఐ బి.రాజు, ఎస్‌ఐ పి.విశ్వనాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. త్వరలో నిందితులను పట్టుకుంటామని క్రైం ఏడీసీపీ రాజారావు తెలిపారు.