
ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానమని, ఫొటో లేని వార్తా పత్రిక వెలుగు లేని దివిటీ లాంటిదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్స వాన్ని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం సోమ వారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ పి.ప్రసాద్ సేకరించిన పురాతన, అరుదైన కెమెరాలను తిలకించారు. అనంతరం లక్ష్మీశ, చక్రపాణి ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి సత్కరించారు. మూడు కేటగిరిల్లో జరిగిన పోటీల్లో ఒక్కో కేటగిరి కింద విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.4 వేల చొప్పున అందజేశారు. బెస్ట్ న్యూస్ పిక్చర్‌లో ఎన్.కిశోర్ (సాక్షి), కె.చక్రపాణి (సాక్షి) ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ జి.అనిత, సీనియర్ ఫొటో జర్నలిస్టు టి.శ్రీనివాసరెడ్డి, విజయవాడ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రవికుమార్, ఆడియో వీడియో విజువల్ సూపర్‌వైజర్ వి.వి.ప్రసాద్, ఐ అండ్ పీఆర్ అధికారి కె.రవి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ