
నిరీక్షణ.. ప్రదక్షిణ!
వత్సవాయి: కూటమి ప్రభుత్వం వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతోంది. పేరుకు స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆ పింఛన్‌ను భార్యకు పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కాలంలో స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. గ్రామాల్లో వాటి వివరాలను కూడా లబ్ధిదారులకు తెలియపరిచారు. కానీ నేటివరకు పింఛన్ నగదు అందలేదు. రెండు నెలలకిత్రం స్పౌజ్ పింఛన్ల వివరాలను తెలియజేసినప్పటికీ ఎందుకు పంపిణీలో జాప్యం జరుగుతుందో అధికారులు తెలపడంలేదు. పింఛన్లు వస్తాయని వృద్ధులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయాలలోని ఉద్యోగులు మాత్రం తమ చేతుల్లో ఏమీలేదని.. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే వస్తాయని చెప్పి పంపించేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి..
ఎన్టీఆర్ జిల్లాలో 4,138 స్పౌజ్ పింఛన్లకు అనుమతులు వచ్చాయి. విజయవాడ రూరల్‌లో 1,101, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 614, నందిగామలో 764, మైలవరంలో 989, తిరువూరు నియోజకవర్గంలో 670 పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ సంబంధిత శాఖలకు పంపింది. కానీ నిధుల మంజూరుకు అనుమతులు మాత్రం రాలేదు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
ఆర్భాటపు హామీలతో అధికారం..
ఎన్నికల సమయంలో అర్హులైన వారందరికీ వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేస్తామని ఆర్భాటపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక నూతన పింఛన్‌ను పంపిణీ చేయలేకపోయింది. వృద్ధులతోపాటు 50 ఏళ్లు దాటిన వారికి కూడా పింఛన్‌ను అందిస్తామని చెప్పింది. కానీ అమలులో మాత్రం నోచుకోవడంలేదు. ఆశపడి ఓట్లేసిన వారికి మాత్రం మొండిచేయి చూపెడుతోంది. భర్త చనిపోయి కుటుంబపోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్న వితంతు మహిళలు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరూ కార్యాలయాల చుట్టూ తిరగడంతోనే ఏడాదికి పైగా గడిచిపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హత కలిగి ఉంటే.. వలంటీరే దరఖాస్తు చేయించి, ఇంటికి వచ్చి నేరుగా పింఛన్‌ను అందించేవారు. నేడు కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్‌ను ఇవ్వలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. దీనిపై వత్సవాయి మండల పరిషత్ ఏవో ఎన్. రాంబా బును వివరణ కోరగా స్పౌజ్ పింఛన్లపై ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రాగానే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
స్పౌజ్ పింఛన్లపై వీడని సస్పెన్స్!
ఇదిగో.. అదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన
ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులు
ఇంకెన్నాళ్లకు ఇస్తారని ఆవేదన
ఎన్టీఆర్ జిల్లాలో 4,138 పింఛన్లు