
నిర్వీర్యమవుతోన్న విద్యారంగం
ధర్నాలో పీడీఎస్‌యూ నేతలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ అన్నారు. గురువారం విజయవాడ ధర్నా చౌక్ నందు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా విద్యారంగ సమస్యల పరిష్కారానికి పూనుకోలేదన్నారు. విద్యారంగంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.
ఖాళీగా పోస్టులు..
రాష్ట్రంలో ఉన్న విశ్వ విద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్లు లేక ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోందన్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లతో పాటు బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పాఠశాల విలీన ప్రక్రియ వల్ల వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో లోకేష్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి, 20లక్షల ఉద్యోగాల ఊసేలేదని, రాష్ట్రవ్యాప్తంగా 2.50లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూషణం, రాజశేఖర్, మహర్షి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు రాజేష్, నాని, లోకేష్, వీరేంద్ర, రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు మానస, సింధు, రమణ తదితరులు పాల్గొన్నారు.
యువతిపై లైంగికదాడి కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): యువతిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితునికి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడైన విజయవాడ వాంబేకాలనీకి చెందిన అత్తిలి కనకరాజు (31)పై నేరం రుజువు కావడంతో గురువారం మహిళా సెషన్స్ కోర్ట్ జడ్జి జి. రాజేశ్వరి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. పోలీస్ కమిషనరేట్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ అజిత్ సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాది తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. 2018 జూన్ 23న కుటుంబసభ్యులు పనిపై బయటకు వెళ్లగా ఫిర్యాది ఒక్కరే ఇంట్లో ఉన్న సమయంలో ఆమె మేనత్త కుమారుడు అత్తిలి కనకరాజు ఇంట్లోకి వచ్చి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి సీఐ ఎంవీవీ జగన్‌మోహన్‌రావు అత్తిలి కనకరాజును గత నెల 29న అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం జడ్జి పైన పేర్కొన్న విధంగా తీర్పు ఇచ్చారు.

నిర్వీర్యమవుతోన్న విద్యారంగం