
వల్లభనేని వంశీపై ఆగని వేధింపులు
గన్నవరం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్‌పై కూటమి సర్కారు వేధింపులు ఆగడం లేదు. జైలు నుంచి బయటికి వచ్చాక కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ మైనింగ్ ఆరోపణల కేసు విచారణ నిమిత్తం శనివారం గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు వంశీ హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నెలా రెండో శనివారం ఆయన విచారణ హాజరుకావాల్సి ఉంది. ఇటీవల ముక్కు సంబంధిత సమస్యకు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు శనివారం ఉదయం వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ కూడా చేశారు. దీంతో తీవ్ర జ్వరానికి గురైన వంశీమోహన్ కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. అయితే సీఐ అందుబాటులో లేరు. ఎప్పుడు వచ్చేదీ కూడా సిబ్బంది చెప్పలేదు. దీంతో మూడు గంటల వరకు స్టేషన్ ప్రాంగణంలోనే వంశీ నిరీక్షించారు. అనంతరం స్టేషన్‌కు చేరుకున్న సీఐ బి.వి.శివప్రసాద్ విచారణ నిమిత్తం మరోసారి పిలుస్తామని వంశీమోహన్‌కు తెలిపారు. అక్కడి నుంచి వంశీ ఆత్కూరు, హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్లకు వెళ్లి కోర్టు ఆదేశాల మేరకు సంతకాలు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి వంశీమోహన్ బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు పలువురు ఉన్నారు.