
దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఉత్తరాంధ్రలోని విజయనగరం, భోగాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి పలు భక్త బృందాలు శనివారం ఇంద్ర కీలాద్రికి తరలివచ్చాయి. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దుర్గమ్మకు ఆషాఢ సారె సమ ర్పించాయి. అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.
వందకు పైగా భక్త బృందాలు..
భవానీదీక్ష సేవా పీఠానికి చెందిన పులపా మల్లేశ్వరరావు గురు భవానీతో పాటు భోగాపురం, విజయనగరం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. వినాయకుడి గుడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర సంప్రదాయం మేరకు అమ్మవారికి పలు రకాల పండ్లు, పూజా సామగ్రి, మిఠాయిలను అమ్మవారికి సమర్పించారు. ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద సారె సమర్పించారు. కృష్ణా, గుంటూరుతో పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి శనివారం పెద్ద ఎత్తున భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి విచ్చేశాయి. ఈ ఒక్క రోజే సుమారు వందకు పైగా భక్తబృందాలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించాయని ఆలయ అధికారులు తెలిపారు.
5వ అంతస్తుకు చేరిన క్యూ
రెండో శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహా మండపం లిఫ్టు మార్గం ద్వారా వచ్చే భక్తులను ఐదు, ఆరు అంతస్తుల్లో దింపేశారు. అక్కడి నుంచి భక్తులు మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ నేపఽథ్యంలో ఐదో అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేసి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు క్యూలైన్లు, రూ.100 టికెటు కొనుగోలు చేసిన వారికి రెండు క్యూలైన్లు, సర్వ దర్శనానికి మూడు క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమితించారు. మరో వైపున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గ మాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం

దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె

దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె

దుర్గమ్మకు ఉత్తరాంధ్ర సారె