
పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్
జి.కొండూరు: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు పోస్టాఫీసు పరిస్థితి. గ్రామానికి చెందిన పలువురు ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము, డిపాజిట్‌లను పోస్టుమాస్టరే కాజేసిన ఘటన గురువారం వెలు గులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన అకౌంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోగా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము లేకపోవడంతో అనుమానం వచ్చి పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు గురువారం సున్నంపాడు వచ్చి విచారణ చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.22లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్‌ల నుంచి మాయమైనట్లు తేలినట్లు తెలిసింది. మొత్తం రూ.50లక్షలకు పైగానే సొమ్మును పోస్టుమాస్టర్ విత్‌డ్రా చేసినట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతుండడంతో శుక్రవారం అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
మునిసిపల్ కార్మికుల
అర్ధనగ్న ప్రదర్శన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు కార్మికులు గురువారం నిరసన తెలిపారు. మునిసిపల్ ఇంజినీరింగ్ (వాటర్, పార్కు, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్) కార్మికుల జీతాలు జీవో నంబర్ 36 ప్రకారం పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.