
ప్రజా భద్రత గాలికి..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘మాట్లాడితే.. లోపలేయండి’ అని ఆ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఆదేశించిందే తడవు.. పోలీసులు ముందూవెనుకా చూడకుండా అమలు చేస్తున్నారు. ప్రశ్నించిన వారి పై ఎదురు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్థానిక సమ స్యలపై మట్టి, బూడిద, ఇసుక దోపిడీపై ప్రశ్నించిన పౌరులు, ప్రజా సంఘాల నాయకులపై కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తూ పోలీసులే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సోషల్ మీడి యా కేసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధి రాసిన రాజ్యాంగమే తమకు శిరోధార్యమన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు విస్తుపోతున్నారు.
ప్రశ్నిస్తే కేసులే..
● కూటమి ప్రభుత్వ తీరు, మైలవరం నియోజక వర్గంలో కుంటుపడిన అభివృద్ధి, యథేచ్ఛగా జరుగుతున్న మట్టి మాఫియా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇబ్రహీంపట్నంకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలమా రామారావుని మైలవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రామారావు తనకు అరోగ్యం సక్రమంగా లేదని చెప్పినప్పటికీ కనీసం కనికరం లేకుండా తీసుకెళ్లి దాదాపుగా ఎనిమిది గంటలకు పైగా విచారణ జరిపారు. డయాలసిస్ అనంతరం గురువారం మరలా పోలీసుస్టేషన్‌కు రావాలంటూ ఆదేశించి పంపినట్లు తెలిసింది.
● మైలవరం నుంచి నూజివీడు వెళ్లే ప్రధాన రహదారి ప్రారంభం నుంచి ఐదు కిలోమీటర్ల మేర తవ్వి వెట్ మిక్స్ వేసి వదిలేశారు. నాలుగు నెలలు గడిచినా ఈ రహదారి నిర్మించకపోవడం వల్ల స్థానిక ప్రజలు నరకయాతన పడుతున్న నేపథ్యంలో సీపీఎం మండల కార్యదర్శి చాట్ల సుధాకర్ ఆధ్వర్యంలో వెల్వడంలో జూలై 1వ తేదీన ధర్నా నిర్వహించారు. గతంలో కూడా ఇలానే ధర్నాలు నిర్వహించడంతో తన పరువుపోతుందని భావించిన ప్రజా ప్రతినిధి పోలీసులను రంగంలోకి దింపారు. వెంటనే పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని చాట్ల సుధాకర్‌ని అదుపులోకి తీసుకొని బైండోవర్ కేసు పెట్టారు. దీనిపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
● ఇటీవల మైలవరం ప్రజా ప్రతినిధికి చెందిన హైదరాబాద్ భూ వివాదంలో హైడ్రా కూల్చి వేతలపై టీవీలలో వచ్చిన వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేసినందుకు గానూ చెవుటూరుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మైలవరం పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఈ ఘటనలో షేర్ చేసిన వ్యక్తిని కాకుండా ఎటువంటి పోస్టు పెట్టని వైఎస్సార్ సీపీ కార్యకర్తను గంటల సేపు పోలీసుస్టేషన్‌లో కూర్చోబెట్టి వేధించడంతో అతని కుటుంబంలో విభేదాలు తలెత్తాయి.
● మైలవరం మండల పరిధిలో సోషల్ మీడియాలో పోస్టులపై మరి కొంతమందిని పోలీసుస్టేషన్‌కు పిలిచి వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గానూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఏడు కేసులు నమోదు చేశారు.
జర్నలిస్టులనూ వదలరు..
స్థానికంగా జరుగుతున్న మట్టి, ఇసుక, బూడిద మాఫియాలపై కథనాలు రాసిన జర్నలిస్టులకు సైతం నోటీసులు ఇస్తామంటూ పోలీసులు వేధిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జర్నలిస్టులు కథనాలు ఎలా రాయాలో కూడా పోలీసులే చెప్పే స్థాయికి నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.
ప్రజాప్రతినిధికి జీహుజూర్ అంటున్న పోలీసులు ప్రజా భద్రతను గాలికొదిలేసి అక్రమ కేసుల నమోదుపైనే ఆసక్తి సోషల్ మీడియాలో పోస్టులపై వేధింపులు సమస్యలపై పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై బైండోవర్లు జర్నలిస్టులకూ తప్పని పోలీసుల వేధింపులు
మైలవరం నియోజకవర్గంలో ప్రజా భద్రతను గాలికొదిలేసిన పోలీసులు, ప్రజా ప్రతినిధి ఆదేశాలను శిరసావహిస్తూ.. జీ హుజూర్ అంటున్నారు. నియోజకవర్గంలో మర్డర్లు, చైన్ స్నాచింగ్‌లు, గంజాయి సరఫరా, నాటు సారా, రోడ్డు ప్రమాదాలు, పేకాట, కోడి పందేలు, మట్టి దోపిడీ వంటి ఎన్నో నేరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ వాటన్నింటినీ వదిలేసి అక్రమ కేసులపై పోలీసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రజా ప్రతినిధి అవినీతిపై కానీ, రోడ్ల సమస్యలపై కానీ, ప్రభుత్వ పనితీరుపై కానీ ఒక్కపోస్టు పెట్టినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టులు చేస్తున్నారు. అదే టీడీపీ నాయకులు రెచ్చగొడుతూ ఎన్ని పోస్టులు పెట్టినా పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మైలవరం పోలీసుల తీరుపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రజా భద్రత గాలికి..