
దుర్గమ్మ సేవలో మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని వెండి పళ్లెంతో సహా సమర్పించారు. వెండి పళ్లెంను అమ్మవారి పూజా కార్యక్రమాలను ఉపయోగించాల్సిందిగా ఆలయ అధికారులను మంత్రి కోరారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను బహూకరించారు.
20న ఏపీ ఎంఏయూ ఎన్నికలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ గుర్తింపు సంఘమైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ నియామకాలకు ఈ నెల 20 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. గిరిబాబు తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 19న నామినేషన్లు స్వీకరిస్తామని, 20 నామినేషన్‌ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొడాలి శేషయ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. అదే రోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశమై వైద్య ఉద్యోగుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం తీర్మానాలు చేస్తారని వివరించారు.
శిక్షణలో క్రమశిక్షణ అవసరం
కోనేరుసెంటర్: ఫైరింగ్ శిక్షణను సజావుగా సద్వినియోగం చేసుకోవాలంటే సిబ్బందికి క్రమశిక్షణ అవసరమని జిల్లా ఎస్పీ ఆర్ గంగా ధరరావు పేర్కొన్నారు. మంగినపూడి బీచ్ సమీపంలోని ఫైరింగ్ శిక్షణ కేంద్రంలో జిల్లాలోని పోలీసు అధికారులకు శుక్రవారం ఫైరింగ్‌లో శిక్షణ నిచ్చారు. కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించి, ఫైరింగ్‌కు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు సంసిద్ధులై ఉండాలన్నారు. ఫైరింగ్‌లో ప్రతి ఒక్కరు మెలకువలు నేర్చుకుని అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అత్యంత కీలకమైనవన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యాధరపురం కబేళా వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపీహెచ్(ఫీమేల్), ఎంఎల్‌టీ వకేషనల్ విభాగంలో జూనియర్ లెక్చరర్స్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హఫీజ్ షేక్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీహెచ్‌కు బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్‌టీకి బీఫార్మసీ, ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీలో కనీస 50 శాతం మార్కులు ఉండా లని వివరించారు. ఆసక్తిగల వారు సంబంధిత అర్హత పత్రాలతో ఈ నెల 14వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని తెలిపా రు. ఇంటర్వ్యూ, డెమో 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 98858 41277లో సంప్రదించాలన్నారు.
ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో..
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణకాంత్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ, ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం), కామర్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు ఒక్కో పోస్టు, తెలుగు, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీలోపు మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.