
నకిలీ టూల్స్ విక్రయిస్తున్న దుకాణంపై కేసు నమోదు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పాతబస్తీలో నకిలీ టూల్స్ విక్రయిస్తున్న దుకాణంపై వన్‌టౌన్ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి, కేసు నమోదు చేశారు. పాతబస్తీలోని ఓ దుకాణంలో తమ కంపెనీకి చెందిన టూల్స్ స్థానంలో నకిలీవి విక్రయిస్తున్నట్లుగా పవర్ టూల్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్‌కుమార్ బుధవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దానిపై సీఐ గురుప్రకాష్ తన సిబ్బందితో రాజా రంగయ్యప్పారావు వీధిలోని విజయశ్రీ టూల్స్ గోడౌన్‌పై దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. రూ.15 లక్షల విలువైన కంపెనీ నకిలీ సరుకును గుర్తించి, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు
గన్నవరం: స్థానిక విమానాశ్రయంలో తప్పిపోయిన బాలుడు ఎట్టకేలకు తల్లి చెంతకు చేరాడు. ఈ మేరకు ఆ బాలుడిని అతడి తల్లి ప్రసన్నకు గన్నవరం పోలీసులు అప్పగించారు. విమానాశ్రయంలోకి తప్పిపోయి వచ్చిన బాలుడిని ఎయిర్‌పోర్ట్ అధికారులు మంగళవారం రాత్రి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ బాలుడి గురించి సామాజిక మాధ్యమల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన ప్రసన్న భర్త శివకృష్ణతో నెలకొన్న విభేదాల కారణంగా ఏడేళ్ల కుమారుడు అనిల్‌కుమార్‌తో పాటు గన్నవరం వచ్చి ఓ ఆశ్రమంలో వంట పని చేస్తోంది. ఈ నేపథ్యంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన అనిల్‌కుమార్ విమానాశ్రయంలోకి వెళ్లి తప్పిపోయాడు. చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న తల్లి ప్రసన్న చెంతకు ఆ బాలుడు చేరడంతో కథ సుఖాంతమైంది.
గ్రావెల్ అక్రమ తవ్వకాల్లో ప్రమాదం
నందిగామరూరల్: మండలంలోని రాఘవాపురం గట్టు నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తుండగా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా పొక్లెయిన్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని రాఘవాపురం గట్టు నుంచి రెండు, మూడు రోజులుగా రాత్రి వేళల్లో గ్రావెల్ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గట్టు భాగంలో బుధవారం తెల్లవారుజామున గ్రావెల్ తవ్వుతున్న పొక్లెయిన్, లోడింగ్ కోసం సిద్ధంగా ఉన్న టిప్పర్‌పై కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వర్లు(27), పొక్లెయిన్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటినా విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా టిప్పర్ డ్రైవర్ చిన్న వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్న వెంకటేశ్వర్లు గడిచిన నాలుగు నెలలుగా నందిగామలోనే నివాసముంటున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ ప్రమాదంలో పొక్లెయిన్ మట్టి కిందకు కూరుకుపోగా లారీ పూర్తిగా ధ్వంసంమైంది.
కృష్ణానదిలో మహిళ మృతదేహం లభ్యం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకు వచ్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రకాశం బ్యారేజీ 56వ కానా వద్ద బుధవారం ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమీపంలోని పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణలో ఆ మృతదేహం వాంబేకాలనీలో నివాసముండే పద్మప్రియ(50)గా గుర్తించారు. పద్మప్రియ కుమారుడు యగ్ని హేమంత్ తన తండ్రి 15 ఏళ్ల క్రితం మరణించాడని, తనను, తన చెల్లెలను తల్లి చూసుకుంటూ వచ్చిందని తెలిపారు. 2022లో తన చెల్లి మరణించినప్పటి నుంచి మానసికంగా స్థిమితం లేక పదేపదే బయటకు వెళ్లటం, ఎక్కువగా మాట్లాడటం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఆమెకు చికిత్స చేయిస్తున్నానని, బుధవారం ఉదయం నిద్ర లేచి చూడగా ఇంట్లో తల్లి కనపడలేదని చెప్పాడు. ఆమె కోసం వెతుకుతున్నట్లు వివరించాడు. వన్‌టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొండ చరియలు విరిగి పడి టిప్పర్ డ్రైవర్ మృతి పొక్లెయిన్ ఆపరేటర్‌కు గాయాలు, వాహనాల ధ్వంసం

నకిలీ టూల్స్ విక్రయిస్తున్న దుకాణంపై కేసు నమోదు