వర్గీకరణకు చట్టబద్ధత కల్పించండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతికి పంపాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ రూరల్ నల్లకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్‌లో నిర్వహించిన ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణ అమలు అయ్యేవరకు అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలు నిలుపుదల చేయాలని, అలాగే ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆర్డినెన్స్ జారీ చేయటంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీష, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్‌చార్జ్ ముమ్మిడివరపు చిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు స్వాధీనం
జగ్గయ్యపేట: తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి. వెంకటేశ్వర్లు సోమవారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ముక్త్యాల గ్రామానికి రాత్రి గస్తీ నిమిత్తం సీఐ వెళ్లారు. అక్కడ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇసుక లారీలు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేశారు. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలుతున్నట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి లారీలను చిల్లకల్లు స్టేషన్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు.
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు మాదిగ