
భవానీపురం(విజయవాడపశ్చిమ): దశాబ్దాలుగా అక్కడ ఖాళీ స్థలంలో చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గూడు ఏర్పాటు చేసింది. తమ చిరకాల కోరిక సాకారం అయిన సంతోషం వారి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వర్షా కాలంలో అమ్మకాలు సాగక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు స్వాంతన చేకూరింది. మత్స్య ఉత్పత్తులను దాచుకునేందుకు ఇకపై అవస్థలు పడాల్సిన పని ఉండదన్న ఆనందం వారి మాటల్లో వ్యక్తం అవుతుంది. కృష్ణానదీ తీరాన భవానీపురం పున్నమిఘాట్ పక్కన ఉన్న విద్యాధరపురం చేపల రేవులో మత్స్య ఉత్పత్తుల అమ్మకందార్లకు మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు (షెడ్లు) ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన – చేపల అమ్మకంపై దేశీయ ప్రచారంలో భాగంగా నాణ్యమైన విలువలతో కూడిన మత్స్య ఉత్పత్తుల సరఫరా నిమిత్తం స్థానిక పున్నమిఘాట్ వద్దగల ఇరిగేషన్ స్థలంలో మత్స్య శాఖ ప్రభుత్వం ద్వారా ఫిష్ కియోస్క్ 195 చదరపు అడుగుల స్థలాన్ని లబ్ధిదారులకు కేటాయించింది.
చేపల అమ్మకాలను ప్రోత్సహించేందుకు..
డొమెస్టిక్ మార్కెటింగ్ కింద హబ్/స్పోక్ మోడల్‌లో వివిధ మత్స్య ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ద్వారా ప్రభుత్వం చేపల అమ్మకాలను ప్రోత్సహిస్తుంది. ఒక్కో యూనిట్ విలువ లక్ష రూపాయల నుంచి 3లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో రూ.10 వేలు జమ చేసి బ్యాంక్ రుణం పొంది ఫిష్ కియోస్క్‌లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. మత్స్యకారులు ఇప్పటి వరకు కృష్ణానదీ తీరాన అనధికారకంగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మత్స్య శాఖ ద్వారా వారికి అవసరమైన భూమిని ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలాన్ని మత్స్య శాఖ లీజు ద్వారా తీసుకుని 195 చదరపు అడుగుల చొప్పున విభజించి కేటాయించింది.
12 మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు ఏర్పాటు...
విద్యాధరపురం చేపల రేవులో మొత్తం 12 మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ల నిర్మాణం జరిగింది. ఒక్కో యూనిట్‌ను నిర్మించేందుకు రూ.80 వేలు చొప్పున లబ్ధిదారులు కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుని నిర్మించుకున్నారు. ఇందులో మత్స్య శాఖ ఒక్కో లబ్దిదారుకి రూ.75 వేలు బ్యాంక్ ద్వారా రుణం మంజూరు చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా బహిరంగంగా మత్స్య ఉత్పత్తులను విక్రయిస్తున్న మత్స్యకారులకు ఇప్పటికి ఒక గూడు ఏర్పడటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండైనా..వర్షమైనా ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండదని, మత్స్య ఉత్పత్తులను భద్రపరుచుకునేందుకు అవస్థలు పడే పని లేదని ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారు. నదిలో వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు వేట విరామ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం మరువలేమని మత్స్యకారులు అంటున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా కూడా తమ కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెబుతున్నారు.
మత్స్య ఉత్పత్తుల విక్రయదారులకు దుకాణాలు
విద్యాధరపురం చేపల రేవులో మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు
కృష్ణానది తీరాన స్థలం కేటాయించినజిల్లా మత్స్య శాఖ
సొంత ఖర్చుతో షాపులు నిర్మించుకుంటున్న మత్స్యకారులు