
మైలవరం: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండకు చెందిన యూసీసీఐ స్వచ్ఛంద సంస్థ మైలవరం అయ్యప్పనగర్‌లో బుధవారం బోర్ పంపు ఏర్పాటు చేసింది. ఐర్లాండ్‌కు చెందిన విదేశీ ప్రతినిధుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ బోరు పంపుతో దాదాపు 60 కుటుంబాల నీటి సమస్య పరిష్కారమైందని సర్పంచ్ గరికపాటి మంజు భార్గవి తెలిపారు. యూసీసీఐ సంస్థ ద్వారా ఇప్పటికే 20 తాగునీటి బోర్ పంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో బోరు వేయడానికి రూ.1.5 లక్షల వరకూ ఖర్చయ్యిందని వివరించారు. వంగూరు రమేష్‌బాబు, మల్లెల అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూసీసీఐ డైరెక్టర్ ఎన్. ఇమ్మానియేలు బాబు, మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోయ సుధ పాల్గొన్నారు.
టేబుల్ టెన్నిస్‌లో
ఉయ్యూరు డీఈ ప్రతిభ
ఉయ్యూరు: రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఓపెన్ సింగిల్స్ విభాగంలో విద్యుత్ శాఖ ఉయ్యూరు డీఈఈ ఎంవీవీ రామకృష్ణ ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కార్పొరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్, ఏపీసీపీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో 2023–24 సంవత్సరానికి చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. గుంటూరులో ఈనెల 8, 9, 10 తేదీల్లో జరిగిన పోటీల్లో టేబుల్ టెన్నిస్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో డీఈఈ రామకృష్ణ ప్రతిభ చాటి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఉయ్యూరు డీఈ కార్యాలయంలో బుధవారం ట్రోఫీ అందుకున్న రామకృష్ణను ఏఈలు నాగమల్లేశ్వరరావు, అధికారులు, సిబ్బంది అభినందించారు.
‘మాతృత్వ వందన
యోజన’పై దృష్టి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మొదటి కాన్పుతో పాటు, రెండో కాన్పులో ఆడ శిశువు పుట్టిన వారికి ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం అందించడంపై వైద్యాధికారులు దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. ఆమె బుధవారం తన కార్యాలయంలో యూపీహెచ్‌సీ, గ్రామీణ ప్రాంత సీఓలు, ఏఎన్‌ఎంలు, పర్యవేక్షకులకు పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రెండో కాన్పులో ఆడ శిశువు పుట్టిన ప్రతి తల్లికి ఈ పథకం వర్తించేలా ఆశ, ఏఎన్‌ఎంలు తమ పరిధిలో వారి వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తదుపరి చికిత్సలు అవసరం అయిన రిఫరల్ కేసులకు సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డాక్టర్ మాధవి, డీఎంఓ డాక్టర్ మోతీబాబు, డాక్టర్ బాలాజీనాయక్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ సమీర తదితరులు పాల్గొన్నారు.
యార్డులో 29,637
బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 28,515 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 29,637 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 24,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.8,000 నుంచి రూ.22,000 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.10,000 నుంచి 24,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 9,264 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

