పామర్రు: మండల పరిధి పోలవరం గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై మైనింగ్ శాఖాధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పోలవరం గ్రామంలో చెరువులో మట్టి తవ్వకాలపై స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబుకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మైనింగ్ అధికారులు మంగళవారం గ్రామంలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై దాడులు చేశారు. దాడుల్లో సంఘటనా స్థలంలో ఉన్న రెండు మట్టి ట్రాక్టర్లను, ఒక డ్రోజర్‌ను, ఒక ఇటార్చి(చిన్న పొక్లెయినర్)లను స్వాధీనం చేసుకోని సీజ్ చేశారు. వీటిని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు మైనింగ్ జియాలజిస్ట్ కొండారెడ్డి తెలిపారు. దాడుల్లో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


